విక్రమ్ ల్యాండర్ జాడ కనుగొన్నది మనోడే! - MicTv.in - Telugu News
mictv telugu

విక్రమ్ ల్యాండర్ జాడ కనుగొన్నది మనోడే!

December 3, 2019

ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 విక్రమ్ ల్యాండర్ సాంకేతిక లోపంతో చంద్రుడి ఉపరితలంపై సెప్టెంబర్ నెలలో కుప్పకూలిన సంగతి తెలిసిందే. దీని జాడ కోసం నాసా ప్రయత్నించి చివరకు దాని ఆచూకీ కనిపెట్టింది. తాజాగా ఆ ఫొటోలను కూడా విడుదల చేశారు. ఈ కృషి వెనక భారతీయుడే ఉండటం విశేషం. చెన్నైకి చెందిన ఓ సాధారణ ఇంజనీరు విక్రమ్ జాడ కనుక్కోవడంలో సాయం చేశాడు. దీంతో నాసా అతనిపై ప్రశంసలు కురిపించింది.  

 

చెన్నైకి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి షణ్ముగ సుబ్రమణియన్ విక్రమ్ ల్యాండర్‌ను కనిపెట్టేందుకు అధ్యయనం ప్రారంభించారు. అప్పట్లో నాసా విడుదల చేసిన ఫొటోలను ఆధారంగా విక్రమ్ గమనాన్ని పరిశీలించాడు. దాని ద్వారా తాను గుర్తించిన విషయాలను అక్టోబర్3న నాసాకు దృష్టికి తీసుకెళ్లాడు. ఆయన చెప్పిన విధంగా ఆర్బిటార్ ప్రయాణ గమనాన్ని పరిశీలించారు. ఈ  అధ్యయనం ప్రారంభించిన నాసా చివరకు విక్రమ్ జాడ కనిపెట్టింది. ఈ సందర్భంగా అతడు అందించిన సాయం అద్భుతమని నాసా శాస్త్రవేత్తలు కితాబిచ్చారు. 

కాగా నాసా విక్రమ శకలాలు 24 చోట్ల చిందరవందరగా పడినట్టు వెల్లడించింది. దాదాపు ఒక కిలోమీటర్ పరిధిలో ఇవి పడిపోయి ఉన్నట్టుగా తెలిపారు. ఈ సందర్భంగా సుబ్రమణియన్ మాట్లాడుతూ.. స్పేస్ టెక్నాలజీపై అధ్యయనం చేయాలనే కోరికతోనే నాసా శాస్త్రవేత్తలకు తన సాయం అందించానని తెలిపాడు. విక్రమ్ పయనించిన మార్గాన్ని తాను నిశితంగా అధ్యయనం చేయడంతోనే ఇది సాధ్యమైందన్నాడు. తాను ఇప్పటి వరకు ఏ ఒక్క రాకెట్ లాంచ్ంగ్ మిస్ కాలేదని చెప్పాడు. మనవాడే ఈ ఘనతకు కారణం కావడంతో అంతా గర్విస్తున్నారు. కాగా సాంకేతిక కారణాలతో సెప్టెంబర్ 6న విక్రమ్ ల్యాండర్ ఇస్రోతో సంబంధాలు తెగిపోయిన సంగతి తెలిసిందే.