పౌరసత్వం రద్దు కేసు.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు ఊరట  - MicTv.in - Telugu News
mictv telugu

పౌరసత్వం రద్దు కేసు.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు ఊరట 

November 22, 2019

Chennamaneni Ramesh citizenship case high court stays 

టీఆర్ఎస్‌కు చెందిన వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌ పౌరసత్వ రద్దు కేసులో చరిత్ర పునరావృతం అవుతున్నట్లు కనిపిస్తోంది. ఆయన పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర హోం శాఖ తీసుకున్న నిర్ణయంపై తెలంగాణ హైకోర్టు ఈ రోజు స్టే విధించింది. కేంద్ర ఉత్తర్వులను 4 వారాలపాటు నిలిపివేస్తున్నామంటూ తదుపరి విచారణను డిసెంబర్‌ 16కు వాయిదా వేసింది. 

జర్మనీలో స్థిరపడిన రమేశ్ మోసపూరితంగా భారత పౌరసత్వాన్ని స్వీకరించారని కేంద్రం నిర్ధారించడం తెలిసిందే. 2009లో ఆయన చేతిలో ఓడిపోయిన ఆది శ్రీనివాస్ కోర్టుకెక్కడంతో ఈ విషయం వెలుగు చూసింది. అయితే తాను నేరానికి పాల్పడలేదని రమేశ్ చెప్పగా కేంద్రం విచారణ జరిపించింది. రమేశ్‌పై వచ్చిన ఆరోపణలు నిజమని నిర్ధారించి 2017లోనే ఆయన పౌరసత్వాన్ని రద్దు చేసింది. దీనిపై రమేశ్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు నిర్ణయం తీసుకోకుండా బంతిని మళ్లీ కేంద్ర హోం శాఖవైపు నెట్టేసింది. తిరిగి విచారణ ప్రారంభించిన హోం శాఖ ఆయన పౌరసత్వాన్ని మరోమారు రద్దు చేసింది. ఇది రాజ్యాంగ, చట్టవిరుద్ధమని ఆయన తాజాగా హైకోర్టును ఆశ్రయించారు.