Cheruku Sudhakar merged his party with Congress in delhi
mictv telugu

కాంగ్రెస్‌లో విలీనమైన ఇంటి పార్టీ.. రేవంత్‌పై వెంకటరెడ్డి ఫైర్

August 5, 2022

మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రాజీనామా వ్యవహారంతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. ఇప్పటికే రేవంత్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకటరెడ్డిల మధ్య అభిప్రాయభేదాలు రాగా, వాటిని మరింత పెంచే దిశగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ ఇంటి పార్టీ అధినేత చెరుకు సుధాకర్ తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో మల్లికార్జున ఖర్గే సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెరుకు సుధాకర్‌కు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ‘

ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ శుక్రవారం మునుగోడు నియోజకవర్గంలోని చండూరులో బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి కోమటిరెడ్డి వెంకట రెడ్డి రావాలని ఆహ్వానించారు. అయితే తాజా పరిణామాలతో కోమటి రెడ్డి వెంకట రెడ్డి అసహనంతో ఉన్నారని తెలుస్తోంది. ఇప్పటికే తమ కుటుంబం గురించి చెడుగా మాట్లాడిన రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. తనను ఓడించడానికి ప్రయత్నించిన చెరుకు సుధాకర్‌ను పార్టీలోకి ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి పెద్ద తప్పు చేశారని, ఇకపై ఆయన ముఖం కూడా చూడనని అన్నారు. పార్లమెంటు సమావేశాల తర్వాత మునుగోడుకు వెళతానని వెల్లడించారు. అటు వెంకట రెడ్డి కూడా తమతో టచ్‌లో ఉన్నారని టీబీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొనడంతో వెంకటరెడ్డి కూడా పార్టీ మారుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది.