Chess pieces come alive: Industrialist Anand Mahindra hails 'superb' video, WATCH
mictv telugu

చదరంగంలోని పావులకు ప్రాణం వస్తే అచ్చం ఇలాగే ఉంటుంది: వీడియో

July 30, 2022

ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద మహీంద్ర మరో అద్బుతమైన వీడియోను షేర్‌ చేశారు. సోషల్‌ మీడియాలో ఎపుడూ యాక్టివ్‌గా ఉంటూ ఎన్నో ఇన్నోవేటివ్‌ కథనాలను, వీడియోలను పంచుకునే ఎంఅండ్‌ఎం అధినేత ఆనంద్‌ మహీంద్ర తాజాగా మరో అధ్భుతమైన వీడియోను ట్విటర్‌లో పంచుకున్నారు. చెస్ బోర్డులో ఉన్న పావులకు ప్రాణమొచ్చి మనుషులుగా మారితే ఎలా ఉంటుందో కళ్లకు కట్టినట్లుగా ఆ వీడియోలో చూపించారు. తమిళనాడు రాష్ట్రంలోని పుదుక్కొట్టాయ్ కలెక్టర్ కవితా రాము స్వయంగా కొరియో గ్రఫీతో ఈ వీడియోకు ప్రాణం పోశారు.

 

ఆనంద్ మహీంద్రా ఈ వీడియోను ట్విటర్‌లో షేర్ చేస్తూ.. ‘‘అద్భుతం. పుదుక్కొట్టాయ్ కలెక్టర్ శ్రీమతి కవితారాము కొరియోగ్రఫీ చేసినట్టు నాకు చెప్పారు. చదరంగంలో పావులు సజీవంగా వస్తే ఎలా ఉంటుందో మన కళ్లకు కట్టినట్టు చూపించారు. ఇది ప్రామాణికతను కలిగి ఉంది. మన దేశంలో కనుగొనబడిన గేమ్ ఇది’’ అని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు. ఈ వీడియోను పుదుక్కొట్టాయ్ జిల్లా యంత్రాంగం రూపొందించింది. ఈ అందమైన డ్యాన్స్ వీడియోను తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా మెచ్చుకున్నారు. జిల్లా అధికార యంత్రాంగం చెస్ ఒలింపియాడ్ 2022ను ప్రచారం చేయడానికి ఎన్నో చర్యలు తీసుకుందని ప్రశంసించారు.

చదరంగం ఓ ప్రాచీన క్రీడ. పూర్వం రాజులు తమ ప్రత్యర్థులతో తలపడేటప్పుడు ఎలాంటి వ్యూహాలు రచించాలో.. వారిని ఎలా ఓడించాలో అనే విషయాలపై ఎక్కువగా దృష్టిసారించేవారు. ఏ మూల నుంచి ఎవరు దాడి చేస్తారో తెలియని పరిస్థితుల్లో అన్ని వైపులా ఓ కన్నేసి ఉంచేవారు. దీంతో ఎత్తులు, పై ఎత్తులు వేసి ప్రత్యర్థులను ఓడించేవారు. ఈ క్రమంలోనే ఆ ఎత్తులు, పై ఎత్తుల జిమ్మిక్కులతో చదరంగం పుట్టుకొచ్చిందని చెబుతారు.