యాసిడ్ దాడి బాధితురాలి పాత్రలో దీపిక..ట్రైలర్ వచ్చేసింది - MicTv.in - Telugu News
mictv telugu

యాసిడ్ దాడి బాధితురాలి పాత్రలో దీపిక..ట్రైలర్ వచ్చేసింది

December 10, 2019

Deepika Padukone010

బాలీవుడ్ నటి దీపికా పదుకోన్ తాజా సినిమా ‘ఛపాక్’ ట్రైలర్ ఈరోజు విడుదలైంది. ప్రియుడు రణ్వీర్ సింగ్‌తో పెళ్లి తర్వాత ఆమె నటించిన మొదటి చిత్రం ఇదే కావడం గమనార్హం. మేఘనా గుల్జార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విక్రాంత్ మస్సే దీపిక ప్రియుడి పాత్రలో నటించారు. ఇందులో దీపికా యాసిడ్ దాడి బాధితురాలి పాత్రలో నటించారు.

ఢిల్లీకి చెందిన లక్ష్మీ అగర్వాల్ అనే యువతిపై 2005లో యాసిడ్ దాడి జరిగింది. యాసిడ్ దాడి జరిగినప్పుడు ఆమె వయసు పదిహేనేళ్లు. తన ప్రేమను నిరాకరించిందని ఓ ఉన్మాది లక్ష్మిపై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత కోలుకున్న లక్ష్మి దేశంలో యాసిడ్ అమ్మకాలు ఆపాలంటూ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈమె జీవితాధారంగానే ‘ఛపాక్’ సినిమాను తెరకెక్కించారు. ‘ఛపాక్’ ట్రైలర్‌ను విడుదల చేస్తున్నప్పుడు దీపిక కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..‘మీకు ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను. ఇలాంటి కథలు మన ముందుకు మళ్ళీ మాలీ రావు. ఓ డైరెక్టర్ వచ్చి స్క్రిప్ట్ వివరిస్తే ఓకే చెప్పే కథ కాదు ఇది. ఎమోషనల్‌గా ఈ కథను కనెక్ట్ అయ్యాను కాబట్టే నిర్మాతగా కూడా వ్యవహరించాను. ఈ సినిమా ప్రభావం మన అందరిపై ఉంటుంది. కనీసం ఈ సినిమా చూశాకైనా ప్రజల్లో అవగాహన కలుగుతుందని ఆశిస్తున్నాను’ అని అన్నారు. 2020 జనవరి 10న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.