మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహాలను ఇండో – పాక్ సరిహద్దు ప్రాంతమైన ఎల్వోసీ ప్రాంతంలో ఏర్పాటు చేయనున్నట్టు అమీ పుణేకర్ అనే ఎన్జీవో సంస్థ ప్రకటించింది. ఈ మేరకు కశ్మీర్‌లోని కుప్వారా జిల్లా కలెక్టర్ డాక్టర్ సాగర్ దత్తాత్రేయ దోయ్‌పోడే అనుమతి ఇచ్చారని బుధవారం వెల్లడించారు. మార్చి నెలాఖరుకి ఇందుకు సంబంధించిన పనులు ప్రారంభమవుతాయని తెలిపింది. సరిహద్దుల్లో శత్రువుపై పోరాడే సైనికులకు స్పూర్తినిచ్చేందుకు విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నామని, దీని ద్వారా శివాజీ ఆదర్శాలు, నైతిక విలువల నుంచి ప్రేరణ పొందుతారని భావిస్తున్నట్టు పేర్కొంది. అనుక్షణం శివాజీ శత్రువుపై చూపిన ధైర్య సాహసాలను గుర్తుకు తేవడం ముఖ్య ఉద్దేశమని వివరించింది. నియంత్రణ రేఖ వెంబడి ఉన్న కిరణ్, తంగ్‌ధర్ – తిత్వాల్ లోయలో ఈ రెండు విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నామంది. ఈ విగ్రహాల కోసం శివాజీ స్వయంగా నడయాడిన రాయ్‌గఢ్, తోరన్, శివనేరి, రాజ్‌గఢ్, ప్రతాప్‌గఢ్ కోటల నుంచి మట్టి, నీరు సేకరించి కాశ్మీర్‌కి తీసుకెళతామని అటకేపర్ స్మారక కమిటీ అధినేత అభయ్ రాజ్ షిరోలే వెల్లడించారు. ప్రపంచ దేశాలు శివాజీని ప్రశంసిస్తున్నాయని, ఆయన గెరిల్లా వ్యూహాలను ఇప్పటికీ అనుసరిస్తున్నాయని తెలిపారు. కాగా, ఇప్పటికే ఎల్వోసీ వద్ద రెండు శివాజీ విగ్రహాలను జనవరి 2020లో ఏర్పాటు చేశారు. మరాఠా రెజిమెంట్ ద్వారా ఏర్పాటైన ఈ విగ్రహాల్లో ఒకటి సముద్రమట్టానికి 14 వేల 800 అడుగుల ఎత్తులో ఉంది.