దంతెవాడలో 32 మంది నక్సల్స్ లొంగుబాటు - MicTv.in - Telugu News
mictv telugu

దంతెవాడలో 32 మంది నక్సల్స్ లొంగుబాటు

October 26, 2020

Chhattisgarh: 32 Naxals surrender in Dantewada

ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడలో 32 మంది నక్సలైట్లు పోలీసుల ఎదుట లొంగిపోయారు.  ఆదివారం నాడు బర్సూర్ పోలీస్ స్టేషన్‌కు వచ్చిన 32 మంది నక్సలైట్లలో 10 మంది మహిళా నక్సలైట్లు ఉన్నారు. లొంగిపోయిన వారిలో చేతనా నాట్య మండలి (మావోయిస్టుల సాంస్కృతిక సంస్థ), నక్సలైట్ దండకారణ్య ఆదివాసి కిసాన్ మజ్దూర్ సంఘటన్, రివల్యూషనరీ ఉమన్ ఆదివాసి ఆర్గనైజేషన్, జనతాన గవర్న్‌మెంట్ గ్రూప్ వంటి సంస్థలకు చెందిన వారున్నారు. మావోయిస్టు సిద్ధాంతాలపై భ్రమలు తొలగిపోయాయని వారు తెలిపారు. జిల్లా పోలీసు యంత్రాంగం ప్రకటించిన పునరావాస డ్రైవ్ (రిటర్న్ టు హోమ్) తమను ఆకర్షించడంతో లొంగిపోయి, జనజీవన స్రవంతిలో కలవాలనే నిర్ణయానికి వచ్చామని వారు చెప్పారు. 32 మంది నక్సలైట్లు అందరూ కలిసి సమిష్టిగా లొంగిపోవాలని తీసుకున్న నిర్ణయాన్ని దంతేవాడ ఎస్పీ అభిషేక్ పల్లవ అభినందించారు. 

లొంగిపోయిన వారిలో ఆరుగురిపై రివార్డు ఉందని పేర్కొన్నారు. ఈ విషయమై ఎస్పీ అభిషేక్ పల్లవ మాట్లాడుతూ.. ‘రిటర్న్ టు హోమ్ ప్రచారంతో గత మూడు నెలల్లో 150 మంది నక్సలైట్లు లొంగిపోయారు. వీరిలో 42 మందిపై రివార్డు ఉంది. తాజాగా లొంగిపోయిన 32 మంది నక్సలైట్లలో 19 మంది బకేలి గ్రామానికి చెందిన వారు ఉన్నారు. కోర్‌కొట్టి నుంచి నలుగురు, ఉదెనర్, తుమరిగుండ, మటసి గ్రామాలకు చెందిన వారు ముగ్గురేసి చొప్పున ఉన్నారు. ఎన్నికల నిర్వహణ అధికారులపైన, పోలీసులపై దాడులు, నిర్మాణ పనులకు చెందిన అధికారులపైన దాడులు చేసిన ఆరోపణలు వీరిపై  ఉన్నాయి’ అని అభిషేక్ తెలిపారు. కాగా, భద్రతా కారణాల రీత్యా లొంగిపోయిన నక్సలైట్ల పేర్లను పోలీసు శాఖ వెల్లడించలేదు.