కాళ్లు లేవు, చేతులు లేవు.. అయినా కంప్యూటర్ ఆపరేటర్ - MicTv.in - Telugu News
mictv telugu

కాళ్లు లేవు, చేతులు లేవు.. అయినా కంప్యూటర్ ఆపరేటర్

December 2, 2019

శారీరక లోపాలు ఉన్నవాళ్లలో ఏదో బలమైన శక్తి ఒకటి ఉంటుంది అంటారు. అలాంటి ఓ యువకుడు తోటి వికలాంగులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.  ఛత్తీస్‌గడ్‌లోని బలరామ్‌పూర్‌కు చెందిన అతని పేరు అశీష్. నడవడానికి కాళ్లు లేవు.. పని చేసుకోవడానికి చేతులు లేవు. అయినా అతను ‘నాకు అవి లేవు ఇవి లేవు’ అని అస్సలు బాధపడలేదు. తనలో ఇంకా స్పెషల్ క్వాలిటీ ఏముందో దానిని గ్రహించాడు. బుర్రకు పదునుపెట్టాడు.. చదువులో రాణించాడు. కంప్యూటర్ ఆపరేటర్‌గా ఉద్యోగం సాధించాడు. 

శంకర్‌గఢ్ పంచాయతీ ఆఫీసులో అశీష్ కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. నెలకు రూ.10 వేలు సంపాదిస్తూ కుటుంబానికి అండగా నిలబడ్డాడు. తమ కొడుకు ఏమీ చెయ్యలేడు.. అతనికి అన్నీ తామే చెయ్యాలని భావించిన ఆ కన్నవాళ్లకు అతనే పెద్దదిక్కు అయ్యాడు. కాళ్లూ చేతులు సక్రమంగా ఉన్నవారు చేసే పనుల్ని కూడా అశీష్ చక్కగా చేసేస్తాడు.  కంప్యూటర్‌ను అవలీలగా ఆపరేట్ చేస్తాడు. మొబైల్‌ను కూడా వాడుతాడు. అంతేకాదు స్కూటీని కూడా చక్కగా నడుపుతాడు. అశీశ్‌ను చూసి చుట్టుపక్కలవాళ్లు ఆశ్చర్యపోతుంటారు. 

అశీష్ గురించి బలరామ్ పూర్ జిల్లా కలెక్టర్ సంజీవ్ కుమార్ ఝూ మాట్లాడుతూ.. ‘అశీష్ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. అతనికి ఎవరి సహాయం అక్కర్లేదు. తన పనులన్నీ తానే స్వయంగా చేసుకుంటాడు. కుటుంబ భారాన్ని మోస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. అశీష్‌ను చూసి నేటి యువత స్ఫూర్తి పొందాలి’ అని తెలిపారు. కాగా, ‘నాకు అది లేదు ఇది లేదు’ అని చాలామంది తెగ బాధపడిపోతుంటారు. అలాంటివాళ్లు ఒక్కసారి తమ శరీరాన్ని తేరిపార చూసుకోవాలి. కాళ్లూ చేతులు, కళ్లు, ముక్కు, నోరు అన్నీ సక్రమంగా ఇచ్చిన ఆ భగవంతుడికి కృతజ్ఞత చెప్పాలి. తర్వాత రంగంలోకి దిగితే సాధించలేనిది ఏదీ లేదు అని భావించాలి. శరీరంలో అవిలేని అశీషే అన్ని చేసేస్తుంటే.. అన్నీ ఉన్నవారు ఇంకెంత చేస్తారో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.