రేప్ బాధితురాలి మృతదేహం వెలికితీత.. ఐదుగురి అరెస్ట్  - MicTv.in - Telugu News
mictv telugu

రేప్ బాధితురాలి మృతదేహం వెలికితీత.. ఐదుగురి అరెస్ట్ 

October 8, 2020

Chhattisgarh girl tragedy .

అత్యాచారాలను ఎలాగూ అడ్డుకోలేకపోతున్నాం. బాధితులకు కూడా మన చట్టాలు, కోర్టులు, ప్రభుత్వాలు ఎలాంటి భరోసా ఇవ్వలేకపోతున్నాయి. దీంతో కామాంధులు మరింతగా చెలరేగిపోతున్నారు. మనదేశంలో రోజుకు 90కిపైగా అత్యాచార కేసులు నమోదవుతున్నాయంటే పరిస్థితి ఎంతకు దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. నమోదు కాని కేసుల సంఖ్య వందల్లోనే ఉండొచ్చని అంచనా. ఘాతుకం జరిగిన తర్వాతైనా బాధితులకు సకాలం న్యాయం చేయలేకపోతున్న పోలీస్ వ్యవస్థపై తీవ్ర నిరసనలు పెల్లుబుకుతున్నాయి. 

తన కూతుర్ని ఏడుగురు అత్యాచారం చేశారని, వారిపై పోలీసులు కనీసం కేసు కూడా పెట్టలేదని ఓ తండ్రి మనస్తాపంతో ఆత్మహత్యకు యత్నించాడు. దీనిపై దుమారం రేగడంతో పోలీసులు ఎట్టకేలకు నిందితుల్లో ఐదుగురిని అరెస్ట్ చేశారు. ఆత్మహత్య చేసుకుని చనిపోయిన బాధితురాలి మృతదేహాన్ని అటాప్సీ పరీక్షల కోసం వెలికితీశారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కొండగావ్ జిల్లాలో ఈ సంఘటన చోటుచేసుకుంది. 

జూలై నెలలో టీనేజ్ బాలికపై ఏడుగురు దుర్మార్గులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు. ఆమె మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేయలేదు. ఘోరం జరిగి ఇన్నాళ్లయినా తనకు న్యాయం జరగలేదన్న వేదనతో ఆమె తండ్రి  మంగళవారం ఆత్మహత్యకు యత్నించాడు. పోలీసులపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో వారు బుధవారం అమ్మాయి మృతదేహాన్ని వెలికి తీసి నమూనాలు సేకరించారు.