చత్తీస్‌గఢ్ ప్రభుత్వం సంచలన ప్రకటన..హెలికాప్టర్ ఎక్కిస్తాం.. - MicTv.in - Telugu News
mictv telugu

చత్తీస్‌గఢ్ ప్రభుత్వం సంచలన ప్రకటన..హెలికాప్టర్ ఎక్కిస్తాం..

May 6, 2022

చత్తీస్‌గడ్ ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. సీఎం భూపేశ్ బఘేల్.. రాష్టవ్యాప్తంగా 10,12వ తరగతి చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులు పబ్లిక్ పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన 10మంది విద్యార్థులను ప్రభుత్వ హెలికాప్టర్‌లో ఎక్కిస్తానని హామీ ఇచ్చారు. జిల్లా స్థాయిలోను, రాష్ట్రస్థాయిలోను 10 మంది టాపర్లకు హెలికాప్టర్‌లో ప్రయాణించే అవకాశం కల్పిస్తామని ప్రకటన చేశారు.

ఇటీవలే భూపేశ్ బఘేల్ అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పర్యటనలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో బలరాంపూర్ జిల్లా రాజ్‌పూర్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ..’పిల్లలకు ఈ హెలికాప్టర్ ప్రయాణం ఓ స్ఫూర్తిగా నిలుస్తుంది. జీవితంలో ఉన్నతమైన ఎత్తులకు ఎదగాలన్న వారి ఆశయానికి ప్రేరణ కలిగిస్తుంది. పరీక్ష ఫలితాలు వచ్చిన తర్వాత టాప్-10 విద్యార్థులను హెలికాప్టర్ ప్రయాణం కోసం రాయ్‌పూర్‌కు ఆహ్వానిస్తాం’ అని ఆయన అన్నారు.

మరోపక్క గత సంవత్సరం కరోనా కారణంగా ఛత్తీస్‌ఘడ్‌ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేనివిధంగా వినూత్న రీతిలో ఇంటర్ పరీక్షలను నిర్వహించింది. విద్యార్థులు ఇళ్ల వద్దే పరీక్షలు రాసేలా అవకాశాన్ని కల్పించింది. ఇప్పుడు పది, పన్నెండు తరగతుల తుది పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన 10మంది విద్యార్థులను ప్రభుత్వ హెలికాప్టర్‌లో ఎక్కిస్తానని భూపేశ్ బఘేల్ ప్రకటించడంతో విద్యార్థులు పరీక్షల కోసం తెగ చదువుతున్నారు. మంచి ర్యాంకును సాధించాలి అనే తపనతో పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు.