దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో అన్ని విద్యా సంస్థలు మూతపడ్డాయి. పరీక్షల సమయం కావడంతో అవన్నీ వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఇటీవల కొన్ని మినహాయింపులను కేంద్రం ఇస్తుండటంతో పరీక్షల నిర్వహణపై చాలా రాష్ట్రాల ప్రభుత్వాలు కసరత్తు చేస్తున్నాయి. కానీ ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం మాత్రం కీలక నిర్ణయం తీసుకుంది. పదో తరగతి పరీక్షలు లేకుండానే పై తరగతులకు పంపాలని నిర్ణయించింది. పరీక్షలు అర్ధాంతరంగా ఆగిపోవడంతో అందరిని పాస్ చేయాలని ప్రభుత్వం పేర్కొంది.
ఇటీవల అక్కడ పది, ఇంటర్ పరీక్షలు ప్రారంభం అయినా మధ్యలో వేయిదా వేయాల్సి వచ్చింది. దీంతో ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించే కంటే పై తరగతులకు పంపడమే ఉత్తమమని విద్యాశాఖ అభిప్రాయపడింది. దీని కోసం ఇంటర్నల్ పరీక్షల ఆధారంగా మార్కులను కేటాయించి పై తరగతులకు ప్రమోట్ చేస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం కూడా దగ్గర పడుతోందని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. ఎవరైనా అప్పట్లో పరీక్షలకు రాకపోయినా కూడా సాధారణ మార్కులతో పాస్ చేసేందుకు నిర్ణయించింది. ఏ ఒక్క విద్యార్థి కూడా ఫెయిల్ కాకుండా అందరిని పాస్ చేసి పై తరగతులకు పంపాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. దీంతో విద్యార్థులు తెగ సంబరపడిపోతున్నారు.