చెల్లెలి కోరిక.. లొంగిపోయిన మావోయిస్టు అన్నయ్య - MicTv.in - Telugu News
mictv telugu

చెల్లెలి కోరిక.. లొంగిపోయిన మావోయిస్టు అన్నయ్య

August 3, 2020

Chhattisgarh Naxal surrenders after sister's appeal on Raksha Bandhan

రాఖీ కట్టిన ముద్దులు చెల్లికి గారాల అన్నయ్య వాగ్దానం చేశాడంటే అది తూచతప్పకుండా నెరవేర్చాల్సిందే. అన్నకు అది ఎంతటి సంక్లిష్టమైనది అయినా చెల్లి కోసం ఆమాత్రం చెయ్యాల్సిందే. చెల్లెలు రక్ష కోసం వచ్చే ఈ పండగను ఆ చెల్లి అన్న రక్ష కోసం వినియోగించింది. రక్షా బంధన్‌ సందర్భంగా ఓ సోదరి తన అన్నయ్యను పూర్తిగా మారు మనసు పొందేలా మార్చుకుంది. నక్సలైట్ అయిన అన్యయ్యను లొంగిపొమ్మని చెప్పింది. అంతే ఆ అన్న చెల్లి మాటకు, చేతికి కట్టుకున్న రాఖీకి విలువ ఇచ్చాడు. వెంటనే తన పాత జీవితానికి స్వస్తి పలికి చట్టానికి లొంగిపోయాడు. ఈ సంఘటన చత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లాలో చోటు చేసుకుంది. దంతెవాడ జిల్లా పల్నార్ గ్రామానికి చెందిన మల్లా అనే మావోయిస్టు తన 12 ఏళ్ల వయసులో ఇంటి నుంచి వెళ్లిపోయి నక్సలైట్ ఉద్యమంలో చేరాడు. 

గత 14 ఏళ్లుగా మల్లా ఇంటికి తిరిగి రాలేదు. దీంతో అతని చెల్లెలు లింగే ఆందోళన చెందారు. తన అన్నయ్యను ఎలాగైనా ఇంటికి రప్పించాలని భావించారు ఆమె. ఈ క్రమంలో 2016లో మల్లా ప్లాటూన్ డిప్యూటీ కమాండరు అయ్యారు. భైరవ్‌ఘడ్ ఏరియా కమిటీ నక్సలైట్ కమాండరుగా పనిచేస్తున్న మల్లా తలపై పోలీసులు రూ.8 లక్షల రివార్డు కూడా ప్రకటించారు. దీంతో లింగే మరింత ఆందోళన చెందారు. పోలీసుల కాల్పుల్లో తన సోదరుడు మరణిస్తాడని.. అలా కాకుండా తన అన్నను కాపాడుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో లింగే రక్షాబంధన్ సందర్భంగా సోదరుడు పోలీసులకు లొంగిపోవాలని విజ్ఞప్తి చేశారు. సోదరి లింగే మాటకు విలువ ఇచ్చాడు మల్లా. అన్నా చెల్లెలి అనుబంధానికి పొంగిపోతూ.. నక్సలిజానికి తిలోదకాలు ఇచ్చి పోలీసులకు లొంగిపోయాడు.  సోదరితో ఆనందంగా రాఖీ కట్టించుకున్నాడు. కాగా, నక్సలిజాన్ని వదిలి జనజీవన స్రవంతిలో కలిసేందుకు లొంగిపోయిన మల్లాకు పునరావాసం కల్పిస్తామని దంతెవాడ జిల్లా ఎస్పీ అభిషేక్ పల్లవ్ వెల్లడించారు.