సంచార ఉపాధ్యాయుడు.. బెల్లు కొట్టి మరీ పాఠాలు  - MicTv.in - Telugu News
mictv telugu

సంచార ఉపాధ్యాయుడు.. బెల్లు కొట్టి మరీ పాఠాలు 

September 18, 2020

Chhattisgarh teacher takes 'mohalla' classes on his bike, netizens praise him

కరోనా సమయంలో ఎందరో మానవత్వంతో ముందుకు వచ్చి తమకు తోచిన సహాయం చేసి మానవత్వాన్ని చాటుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు వీధి వీధి తిరుగుతూ పాఠాలు బోధించడానికి ఓ టీచర్ బయలుదేరారు. తన బైక్ మీద ఒక గొడుగు పెట్టుకుని దానికే బ్లాక్‌బోర్డును అమర్చారు. చుట్టూ కొన్ని ప్లకార్డులు కూడా కట్టారు. పుస్తకాల సరంజామా కూడా వెంట పెట్టుకుని బండి మీద వీధి వీధి తిరుగుతూ పిల్లలకు పాఠాలు బోధిస్తున్నారు. ఛత్తీస్‌ఘడ్‌లో కొరియా జిల్లాలో ఈ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ఆ టీచర్ పేరు రుద్ర రానా. మొహల్లా(వీధులు) క్లాసుల పేరిట ఆయన ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విద్యను పిల్లల ఇంటి గుమ్మానికే తీసుకువచ్చి.. స్కూల్‌లో మాదిరే ఇక్కడ కూడా అలాంటి వాతావరణాన్నే సృష్టించారు. 

ఇలా వీధి వీధి తిరుగుతూ పాఠాలు ఎందుకు బోధిస్తున్నారని ప్రశ్నిస్తే.. పేద విద్యార్థుల కోసం అంటారు. ‘లాక్‌డౌన్ కారణంగా స్కూళ్లకు వెళ్లని విద్యార్థులు ఎంతో నష్టపోయారు. ఇప్పుడిప్పుడే ప్రైవేట్ పాఠశాలలు ఆన్‌లైన్ క్లాసులు అని మొదలు పెట్టాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారా? నిర్వహించినా పేదవారి దగ్గర స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఇంటర్నెట్ వంటివి ఉండవు. దీంతో వారు మరింత నష్టపోతున్నారు. అందుకే వారి కోసం ఈ ఆలోచతోన చేశాను’ అని రుద్ర తెలిపారు. రానా వస్తూనే బెల్ మోగిస్తారు. ఆ శబ్దానికి విద్యార్థులు ఇళ్లనుంచి బయటకు వచ్చేస్తారు. తర్వాత వారితో ప్రార్థన చేయిస్తారు. అనంతరం సిలబస్ ప్రకారం తరగతులు ప్రారంభిస్తానని రానా వెల్లడించారు. ఇలా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రయాణించి విద్యార్థులను సేకరించి విద్యాబోధన చేస్తున్నారు. కాగా, ఆయన చేస్తున్న మంచి పనికి స్థానికులు కూడా సహాయం చేస్తున్నారు. విద్యార్థులు కూడా ఇతని వద్ద చదువుకోవడానికి మొగ్గ చూపుతున్నారు. మరోవైపు కరోనా సమయంలో ఈ టీచర్ ఆలోచన బాగుందని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.