చాయ్‌వాలా సరే, ఈ చాయ్‌వాలీ గురించి తెలుసుకుందాం..! - MicTv.in - Telugu News
mictv telugu

చాయ్‌వాలా సరే, ఈ చాయ్‌వాలీ గురించి తెలుసుకుందాం..!

April 16, 2019

టీ అంటే ఇష్టం లేని వారుండరు. ఆ ఇష్టంతో తిండి మానుకుని ఎవ్వరూ అస్తమానూ చాయ్ తాగరు కదా. ఏదో రోజులో ఒకటి రెండుసార్లు మాత్రమే టీ తాగుతారు. కానీ ఓ మహిళ మాత్రం టీ తాగుతూనే బతికేస్తోంది. గత 30 ఏళ్ల నుంచే ఆమె టీ తాగేసి బతికేస్తోంది అంటే నమ్మశక్యంగా లేదుకదూ. కానీ నమ్మాల్సిందే.

ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని కొరియా జిల్లా బరాదియా గ్రామానికి చెందిన పిల్లీ దేవి అనే మహిళ చాయ్ తాగి ఎలాంటి అనారోగ్యం లేకుండా చాలా ఆరోగ్యంగా జీవిస్తోంది. ఆమె చాయ్ అలవాటు చూసి ఆమెను అంతా చాయ్ వాలీ చాచీ అని పిలుస్తారు. గత 30 ఏళ్లకు పైగా ఆమె టీ తాగుతూ బతుకుతోంది. తన 11 ఏళ్ల వయసులో ఆహారం ముట్టడం మానేసిన పిల్లీ దేవి వయసు ఇప్పుడు 44 ఏళ్లు. అంటే ఆమె గత 33 ఏళ్లుగా కేవలం టీ నీళ్లు మాత్రమే తాగి బతుకుతోంది. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆమె ఆరోగ్యంగా వుండటం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

Chhattisgarh Woman Claims She’s Been Surviving Only On ‘Chai’ For The Past 33 Years

ఆరో తరగతిలో ఉండగా పిల్లీ దేవి తిండి తినడం మానేసిందని ఆమె తండ్రి రతీరామ్ చెప్పాడు. ‘జనక్ పూర్‌లోని పాట్నా స్కూల్ తరఫున జిల్లా స్థాయి టోర్నమెంట్‌లో పాల్గొంది మా బిడ్డ. ఇక అప్పటినుంచి తిండి, నీళ్లు మానేసింది’ అని చెప్పాడు. కొన్నాళ్లు పాల టీతో బిస్కెట్లు, బ్రెడ్ తిని ఆ తర్వాత పూర్తిగా టీ మీదే బతుకుతోంది. ఇప్పుడామె సూర్యాస్తమయం తర్వాత ఒకసారి కప్పు బ్లాక్ టీ మాత్రం తాగుతుంది.

ఆమె అలవాట్లను చూసి బెంబేలెత్తిపోయిన కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తీసుకువెళ్లి పరీక్షలన్నీ చేయించారు. అన్నీ పరీక్షల్లో ఆమె సంపూర్ణ ఆరోగ్యవంతురాలని తేలింది. మనుషులు టీ తాగి బతకడం అసాధ్యమని కొరియా జిల్లా ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ ఎస్ కె గుప్తా అన్నారు. 33 ఏళ్లుగా ఆమె అలా జీవించడం ఆశ్చర్యపరుస్తోందని చెప్పారు. ఇంటి నుంచి కాలు బయటకు పెట్టదు పిల్లీ దేవి. రోజంతా శివారాధనలోనే గడుపుతుంది.