మసూద్ పై తగ్గని చైనా మోజు
జైషే మహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజర్ ను చైనా మరోసారి వెనకేసుకొచ్చింది. తమ దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు కారణమైన మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించి నిషేధం విధించాలని భారత్ చేసిన విజ్ఞప్తికి అంగీకరించేది లేదని చైనా విదేశాంగ శాఖ ప్రకటించింది. భారత డిమాండ్‌పై భద్రతామండిలోని సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయం లేదంది. రెండేళ్ల నుంచి భారత్ చేస్తున్న ప్రయత్నాలకు ఈసారి కూడా సాంకేతిక కారణాల సాకు చూపి చైనా బ్రేక్ వేసింది. భధ్రతామండలిలో ఉన్న మొత్తం 15 శాశ్వత సభ్య దేశాల్లో 14 దేశాలు భారత్‌కు మద్దతిస్తుండగా, ఒక్క చైనా మాత్రం తనకున్న వీటో పవర్‌తో మసూద్‌కు కొమ్ముకాస్తోంది.
సెప్టెంబర్లో జరిగిన బ్రిక్స్ సమావేశాల్లో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌తో సమావేశమైన ప్రధాని మోడీ, మసూద్ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లినట్టు వార్తలొచ్చాయి. మోడీ-జిన్ పింగ్ మీటింగ్ ఫలప్రదంగా జరిగిందని భారత విదేశాంగ శాఖ చేసిన ప్రకటనతో మసూద్ విషయంలో మోడీ చైనా మనసు మార్చారని అంతా అనుకున్నారు. కాని చైనా విదేశాంగ శాఖ తన తాజా ప్రకటనతో భారత ఆశలపై నీళ్లు చల్లింది.