కరోనాకు కోడి మందు.. సైంటిస్టుల అద్భుత ఆవిష్కరణ  - MicTv.in - Telugu News
mictv telugu

కరోనాకు కోడి మందు.. సైంటిస్టుల అద్భుత ఆవిష్కరణ 

November 12, 2020

 

hhan

ప్రాణాంతక కరోనా వైరస్‌కు చికిత్స చేయడానికి కొన్ని టీకాలు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే వాటి పనితీరు సరిగ్గా లేదనే విమర్శలు ఉన్నాయి. దీంతో ప్రస్తుతానికి మాస్క్ పెట్టుకోవడం, శానిటైజర్ పూసుకోవడమే అసలైన మందులుగా భావించాల్సిన పరిస్థితి నెలకొంది. మరోపక్క కోవిడ్ వైరస్‌కు చెక్ పెట్టేందుకు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. టీకాతోపాటు మాత్రలు, నాజల్ డ్రాప్స్ వంటివి రూపొందిస్తున్నారు. 

తాజాగా కోడితో కరోనాకు చికిత్స చేయొచ్చని వెల్లడించారు. కోడి నుంచి యాంటీబాడీస్ తీసుకుని కరోనా తీవ్రతను తగ్గించవచచ్చని స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

ఎలుకలు, పందులతో మనుషులకు చాలా పోలికలు ఉన్నట్టే కోళ్లతోనూ మనుషులకు చాలా దగ్గరి పోలికలు ఉంటాయి. మనుషుల్లో మాదిరే కోళ్లలోనూ యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయి. కోడిగుడ్లలోని యాంటీబాడీలు కరోనా నుంచి కొంత కాలం రక్షణ కల్పిస్తాయని తాజా పరిశోధనలో పాల్గొన్న డేరియా మూచీ రోజెన్ అనే శాస్త్రవేత్త తెలిపారు. కోడిగుడ్ల నుంచి సేకరించిన యాంటీబాడీలను నాజల్ డ్రాప్స్ రూపంలో మార్చి కరోనా పేషంట్లకు ఇవ్వొచ్చని పేర్కొన్నారు. 

ప్రయోగంలో భాగంగా శాస్త్రవేత్తలు కొన్ని కోడిగుడ్లలోని పచ్చసొన నుంచి యాంటీబాడీలు సేకరించారు. వాటిని నోస్ డ్రాప్స్ రూపంలోకి మార్చి కరోనా రోగులపై ప్రయోగిస్తున్నారు. దీంతో రోగుల్లో కొంతకాలం రోగనిరోధక శక్తి పెరుగుతున్నట్లు భావిస్తున్నారు. ఆస్పత్రులు, విమానాశ్రయాలు ఇతర బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే సిబ్బంది ఈ డ్రాప్స్ వాడటం వల్ల వారికి కరోనా సోకుండా అడ్డుకోవచ్చని చెప్పారు. ప్రస్తుతం 48 మంది పేషంట్లపై ప్రయోగాలు నిర్వహిస్తున్నామని, పూర్తి ఫలితాలు వచ్చాక మరిన్ని వివరాలు వెల్లడిస్తామని స్టాన్‌ఫర్డ్ శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రయోగాలు విజయవంతమైతే అతి తక్కువ ధరలో కరోనా నిరోధక నాజల్ స్ప్రే అందుబాటులోకి వస్తుందని చెప్పారు. 

వివిధ జంతువుల నుంచి సేకరించిన యాంటీబాడీలు కరోనాను అరికట్టగలవని ఇదివరకు  నిర్వహించిన కొన్ని ప్రయోగాల్లో రుజువైంది. ఒంటెలను పోలిన లామాలు, గుర్రాలు, గాడిదల నుంచి యాంటీబాడీలు తీసుకుని కరోనా టీకాను తయారు చేయడానికి ప్ర్రపంచవ్యాప్తంగా పరిశోధనలు సాగుతున్నాయి.