హైదరాబాద్‌లో 6 వేల కేజీల చికెన్ ఫ్రీ.. ఇప్పుడే - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్‌లో 6 వేల కేజీల చికెన్ ఫ్రీ.. ఇప్పుడే

February 28, 2020

Chicken

చికెన్, గుడ్లు తింటే కరోనా వైరస్ సోకుతుందని ఓ ప్రచారం జరుగుతోంది. దీంతో చాలా మంది భయభ్రాంతులకు గురై నీచు జోలికి వెళ్లడం మానేశారు. అయితే అవన్నీ పుకార్లు, అపోహలే అని తెలియజెప్పడానికి నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో ‘చికెన్, ఎగ్ మేళా’ నిర్వహిస్తున్నారు. తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్, తెలంగాణ పౌల్ట్రీ బీడర్స్ అసోసియేషన్, నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీలు కలిసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఈ చికెన్, ఎగ్ మేళాను నిర్వహిస్తున్నాయి. శుక్రవారం (ఫిబ్రవరి 28) సాయంత్రం 4 గంటల నుంచి ప్రారంభం అయ్యే ఈ మేళాలో 6 వేల కిలోల చికెన్‌తో పాటు కోడిగుడ్లతో చేసిన స్నాక్స్‌ను ఉచితంగా పంపిణీ చేయనున్నారు. 

చికెన్‌ తింటే కరోనా వైరస్ సోకుతుందని సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. దీంతో చికెన్ అమ్మకాలు సగానికి సగం పడిపోయాయి. దేశవ్యాప్తంగా వారానికి సగటున 7.5 కోట్ల కోళ్ల అమ్మకాలు జరుగుతుండగా.. ప్రస్తుతం 3.5 కోట్ల కోళ్లు మాత్రమే అమ్ముడు అవుతున్నాయి. ఫలితంగా కిలో కోడి ధర రూ.100 నుంచి రూ.30-35కి పడిపోయింది. డిమాండ్ తగ్గడంతో చికెన్ ధరలు భారీగా తగ్గిపోయాయి. ప్రస్తుతం కిలో చికెన్ ధర రూ. 80 నుంచి రూ.120లకు విక్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర పౌల్ట్రీ పరిశ్రమ సమాఖ్య ఈ అపోహలను తొలగించడానికి ఈ చికెన్, ఎగ్ మేళాకు నడుం బిగించింది. కరోనా వైరస్‌ (కోవిడ్‌-19)కు, చికెన్‌కు సంబంధం లేదని పౌల్ట్రీ పరిశ్రమ వర్గాలు స్పష్టం చేశాయి. ఆ గాలి వార్తలను నమ్మవద్దని.. చక్కగా చికెన్‌, గుడ్డు తినొచ్చని అంటున్నారు. కాగా, ఈ కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తుండగా టాలీవుడ్ యంగ్ హీరోయిన్ రష్మిక మందన్నా ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.