ముక్కలేకపోతే ముద్ద దిగని నాన్‌వెజ్ ప్రియులకు ఇది అదిరిపోయే వార్త. కొండెక్కిన కోడి కిందకు దిగింది. చికెన్ రేటులు భారీగా పడిపోయాయి. మొన్నటి వరకు ఆకాశాన్ని అంటిన ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో రోజు ఇంట్లో చికెన్ వండుకొని లాగించేవచ్చు. బ్రాయిలర్ చికెన్‌తో పాటు నాటుకోడి మాంసం ధరలు, కోడి గుడ్ల ధరలు తగ్గాయి.
తెలుగు రాష్ట్రాల్లో మొన్నటివరకు ఓ సామాన్య ఫ్మామిలీ చికెన్ వండుకోని తినాలంటే పెనుభారంగా మారేది. కనీసం గుడ్లు వండుకుందామన్న రేట్లు షాక్ కొట్టేవి. అయితే ప్రస్తుతం వేసవి ప్రారంభం కావడంతో పాటు ఉత్పత్తి ఎక్కువగా ఉండడంతో ధరలు తగ్గుతున్నాయి. గతంలో కేజీ చికెన్ రూ.270 వరకు ఉండగా క్రమక్రమంగా తగ్గుకుంటూ ఇప్పుడు రూ.160-170 కే లభించడం ఊరటినిస్తోంది. రానున్న రోజుల్లో మరింత తగ్గే అవకాశం లేకపోలేదని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. బ్రాయిలర్ చికెన్‌తో పాటు నాటుకోడి మాంసం ధరలు కూడా పడిపోయాయి. మొన్నటివరకు రూ.500 పలికిన నాటుకోడి మాంసం.. ఇప్పుడు రూ.350 నుంచి రూ.400కి వస్తుంది. కోడిగుడ్ల ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. జనవరిలో వంద కోడిగుడ్ల ధర రూ.555 ఉండగా.. ఇప్పుడు రూ.440కి తగ్గింది.
అంచనాలకు మించి ఉత్పత్తి రావడంతోనే ధరల్లో తగ్గు దల కనిపించిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ధరలు బాగా తగ్గినా విక్రయాలు మాత్రం పెరగడం లేదని వ్యాపారులు వాపోతున్నారు. గడిచిన రెండు వారాలుగా ధరలు భారీగా తగ్గడంతో వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏటా వేసవి ఆరంభంలో 30 నుంచి 40 శాతం చికెన్ అమ్మకాలు తగ్గుతాయని వ్యాపారులు అంటున్నారు.