బయటికొచ్చిన చిదంబరం.. పారిపోలేదు, తప్పు చేయలేదు!
కోర్టుల్లో అన్ని దారులు మూసుకుపోవడంతో గత్యంతరం లేకపోయింది. ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం ఎట్టకేలకు బయటికొచ్చాడు. నిన్నటి నుంచి ఆచూకీ లేకుండా పోయిన ఆయన ఈ రోజు రాత్రి హఠాత్తుగా ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో సాక్షాత్కరించారు. అక్కడే గుడికూడిన మీడియాతోనూ మాట్లాడారు.
తాను ఎక్కడికీ పారిపోలేదని, అసలు తాను ఏ తప్పూ చేయలేదని చెప్పారు. ‘ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో నేను నిందితుణ్ని కాను. అసలు చార్జిషీట్‌లో నా పేరే లేదు. నాకూ, నా కొడుక్కీ, ఈ కేసులో ఎలాంటి సంబంధమూ లేదు. నేను ఎక్కడికీ పారిపోలేదు. నా న్యాయవాదులతో సంప్రదింపులు జరిపాను…’ అని చెప్పారు. తర్వాత తన నివాసానికి వెళ్లిపోయారు. ఆయనను పట్టుకోడానికి లుకౌట్ నోటీసు కూడా జారీ చేసిన సీబీఐ అరెస్ట్ విషయంపై ఆచితూచి స్పందిస్తోంది. చిదంబరం సుప్రీం కోర్టులో వేసి స్పెషల్ లీవ్ పిటిషన్ శుక్రవారం విచారణకు రానుంది.