Chief follower of CM Jagan Mangali Krishna arrested in Hyderabad
mictv telugu

హైద్రాబాద్‌లో సీఎం జగన్ ముఖ్య అనుచరుడి అరెస్ట్.. ఎందుకంటే

September 15, 2022

అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లును ప్రవేశపెడుతున్న వేళ ఏపీకి సంబంధించిన కీలక పరిణామం హైద్రాబాద్‌లో జరిగింది. సీఎం జగన్ ముఖ్య అనుచరుడు మంగళి కృష్ణను సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం గచ్చిబౌలి పోలీస్ స్టేషనుకి తరలించారు. పులివెందులకు చెందిన మంగళి కృష్ణ సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరు పొందారు. కృష్ణ గతేడాది కాలంగా గచ్చిబౌలిలోని ఓ విల్లాలో నివాసముంటుండగా, ఆ విల్లా యజమాని శివప్రసాద్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కృష్ణని అదుపులోకి తీసుకున్నారు. అద్దె కట్టాలని అడిగితే బెదిరించాడని శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు. అంతేకాక, తన మనుషులతో కలిసి దాడికి ప్రయత్నించారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు కృష్ణను స్టేషనుకి తీసుకొచ్చి ప్రశ్నించారు. ఈ విషయంపై సీఐ సురేష్ మాట్లాడుతూ.. ఫిర్యాదు వచ్చిన మాట వాస్తవమేనన్నారు. అద్దె చెల్లింపుల విషయంలో చిన్న వివాదం తలెత్తిందని, ఇద్దరూ స్టేషనులో రాజీ కుదుర్చుకున్నారని వెల్లడించారు. అలాగే వీరిద్దరూ పాత మిత్రులే కావడంతో సమస్య తొందరగా పరిష్కారమైందన్నారు.