జగన్ ఓదార్పు.. రూ.40కే ఉల్లి  - MicTv.in - Telugu News
mictv telugu

జగన్ ఓదార్పు.. రూ.40కే ఉల్లి 

October 22, 2020

కరోనా సమయంలో కూరగాయల ధరలు సామాన్యులకు చుక్కలు చూయించాయి. ముఖ్యంగా టమోటా, ఉల్లిపాయల ధరలు ఆకాశాన్ని అంటాయి. ఇప్పటికీ వాటి ధరలు మండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఓ శుభవార్త చెప్పింది. రేపటినుంచి రైతు బ‌జార్ల ద్వారా రాయితీపై రూ.40కే కిలో ఉల్లిపాయలు అందించేందుకు ప్రభుత్వం చ‌ర్యలు తీసుకుంది. ఈ మేరకు వ్యవసాయ శాఖామంత్రి కురసాల కన్నబాబు ప్రకటించారు. పెరిగిన ఉల్లి ధరలను నియంత్రించేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులకు ఆదేశాలిచ్చారని గురువారం ఉదయం మీడియా ముందు తెలిపారు. 5 వేల టన్నుల ఉల్లిని నాఫెడ్ ద్వారా దిగుమతి చేసుకుంటున్నామని.. తక్షణమే వెయ్యి టన్నులు మార్కెట్‌లోకి తీసుకువచ్చి రైతుబజార్లలో విక్రయిస్తామని మంత్రి చెప్పారు.

కేజీ రూ.40ల‌కు తొలి దశలో అన్ని ప్రధాన పట్టణాల్లోనూ రైతు బ‌జార్ల ద్వారా విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. ఉల్లి విక్ర‌యాలను క్రమంగా అన్ని ప్రాంతాల రైతుబ‌జార్లకు విక్రయాలు విస్తరిస్తామన్నారు. ‘నాణ్యమైన ఉల్లిపాయలను ప్రతి కుటుంబానికి ఒక కేజీ వంతున రొటేషన్ పద్దతిలో ఇవ్వాలని నిర్ణయించాం. భారీ వర్షాలతో మన రాష్ట్రంలో కర్నూలు సహా ఇతర రాష్ట్రాలైన తమిళనాడు,కర్నాటక, కేరళ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పంట నష్టం జరగింది. దీంతో ఉల్లిరేటుకు రెక్కలొచ్చాయి. గతంలో కూడా  ఉల్లి ధరలు పెరిగినప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుని సబ్సిడీపై  అందించాం. రాష్ట్రంలో 28 వేల హెక్టార్లలో ఉల్లిసాగు జరుగుతోంది. మరో నెలలో కొత్త పంట కొంత అందుబాటులోకి వస్తుంది. ప్రతి ఏటా ఈ సీజన్‌లో 12 వేల క్వింటాళ్లు కర్నూలు ఉల్లి మార్కెట్లకు వచ్చేది. కానీ, ఇప్పుడు 15 వందల నుంచి 2వేల క్వింటాళ్లు మాత్రమే వస్తోంది. గతంలో మహారాష్ట్ర నుంచే అత్యధికంగా ఉల్లి దిగుమతులు జరిగేవి. ఇప్పుడు అక్కడ భారీ వర్షాలు కురవడంతో పంట దిగుబడి బాగా తగ్గిపోయింది’ అని మంత్రి కన్నబాబు వెల్లడించారు.