ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. చలనచిత్ర రంగంలో తొలితరం నటుడిగా పలు విభిన్నమైన పాత్రలను కైకాల పోషించారని అన్నారు. తన వైవిధ్యమైన నటన ద్వారా మూడు తరాల తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొందారని కొనియాడారు. కైకాల మరణం తెలుగు చలన చిత్ర రంగానికి తీరని లోటని విచారం వ్యక్తం చేశారు. కైకాల కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి తన ప్రగాఢ సంతాపం తెలిపారు.
విలక్షణ నటుడు కైకాల సత్యనారాయణ మృతి తెలుగు సినీ పరిశ్రమకు,అభిమానులకు తీరని లోటన్నారు ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు. ఆయన సుమారు 800 సినిమాలలో విలక్షణమైన పాత్రలు పోషించి నవ రస నట సార్వ భౌముడిగా తెలుగుచలన చిత్ర పరిశ్రమలో వెలుగొందారని కొనియాడారు. వారి కుటుంబ సభ్యులకు మంత్రి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కైకాల సత్యనారాయణ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు.