చంద్రబాబు @ 177 కోట్లు, కేసీఆర్ @15 కోట్లు! - MicTv.in - Telugu News
mictv telugu

చంద్రబాబు @ 177 కోట్లు, కేసీఆర్ @15 కోట్లు!

February 13, 2018

దేశంలోని ముఖ్యమంత్రుల ఆస్తుల వివరాలు బయటికొచ్చాయి. వందకోట్లకుపైగా సంపద ఉన్న సీఎంలు ఇద్దరు ఉన్నారు. వారిలో ఒకరు ఏపీ సీఎం చంద్రబాబు. ఆయన ఆస్తులు రూ. 177 కోట్లు. దేశంలో అత్యంత ధనిక సీఎం ఆయనే. ఇక  10 నుంచి 50 కోట్ల మధ్య సంపద ఉన్నవారు ఆరుగురు, కోటి నుంచి 10 కోట్ల మధ్య ఆస్తులున్నవారు 17 మంది,  కోటి రూపాయలలోపు దాచుకున్న సీఎంలు ఆరుగురు తేలారు. అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్ సంస్థ నివేదికలో ఈ వివరాలు ఉన్నాయి.బాబు ఆస్తుల చిట్టా

స్థిర, చరాస్తుల విలువ రూ.177 కోట్లు. చరాస్తులు రూ.134,80,11,728, స్థిరాస్తులు రూ.42,68,83,883. ఇక తెలంగాణ సీఎం కేసీఆర్‌కు రూ. 15 కోట్ల విలువైన ఆస్తులున్నాయి. ఆయన ధనిక సీఎంలలో నాలుగో వ్యక్తి. రూ.6,50,82,464 చరాస్తులు, రూ. 8.65 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి.

చంద్రబాబు తర్వాత స్థానంలో రూ. 129 కోట్ల ఆస్తులతో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ నిలిచారు. రూ.48 కోట్ల సంపదతో పంజాబ్ సీఎం కెప్టెన్ అమరిందర్ సింగ్ మూడో స్థానంలో ఉన్నారు. త్రిపుర సీఎం మాణిక్ సర్కార్‌కు కేవలం రూ.26,83,195 ఆస్తులున్నాయి. ఆయనే అత్యంత పేద సీఎం.  బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వద్ద రూ.30 లక్షల సంపద, కశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీ వద్ద రూ.55 లక్షల సంపద లెక్కతేలింది.

కేసులు..

11 మంది సీఎంలపై  కేసులు ఉన్నాయి. అత్యధికంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణ్‌‌వీస్‌పై 22 ఉన్నాయి. కేరళ సీఎం పినరయి విజయన్‌పై 11 క్రిమినల్ కేసులు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై 10 కేసులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడుపై 3, కేసీఆర్‌పై 2 కేసులు నమోదయ్యాయి. కేసీఆర్‌పై ఓ క్రిమినల్ కేసుంది. దేశంలో కేవలం ముగ్గురే మహిళా సీఎంలు ఉండగా, 28 మంది మగ సీఎంలు ఉన్నారు.