క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ మరోసారి వార్తల్లోకెక్కాడు. క్యాసినో కేసులో ఈడీ విచారణ ఎదుర్కొంటున్న చికోటి ప్రవీణ్‌కు తాజాగా ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. రూ.3 కోట్ల రేంజ్ రోవర్ కారు వ్యవహరంలో ఆయనకు ఐటీ నోటీసులు అందాయి. భాటియా ఫర్నిచర్ పేరు మీద చికోటి ప్రవీణ్ కారును కొనుగోలు చేశారు. దీంతో, మీ కారును ఎందుకు సీజ్ చేయకూడదో చెప్పాలంటూ ఐటీ శాఖ నోటీసులును పంపింది. ఇటీవల కాలంలో చికోటి ప్రవీణ్ వరుస వివాదాల్లో ఇరుక్కుంటూ నిత్యం వార్తల్లో ఉంటున్నారు.
చికోటి కారు చోరీ
గత వారం చీకోటి ప్రవీణ్‌కు చెందిన ఇన్నోవా కారును దుండగలు ఎత్తుకెళ్లారు. ఆయన ఇంటి వద్ద పార్క్ చేసిన కారుతో నిందితులు పరారయ్యారు. ఈ దృశ్యాలు సీసీకెమెరాలో రికార్డయ్యాయి. అంతకుముందు చికోటి నివాసం వద్ద గుర్తు తెలియని వ్యక్తుల రెక్కీ నిర్వహించినట్టు తెలిసింది.
ఈడీ విచారణ తర్వాత దూకుడు
గత సంవత్సరం గుడివాడ క్యాసినో వ్యవహరంతో వెలుగులోకి వచ్చిన చికోటి ప్రవీణ్‌పై ఈడీ దృష్టిసారించింది. తెలుగు రాష్ట్రాల నుంచి క్యాసినోల కోసం ప్రత్యేక ప్యాకేజీల ద్వారా విదేశాలకు తీసుకెళుతూ పెద్దమొత్తంలో నిధుల మళ్లింపునకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై చికోటికి ఈడీ నోటీసులు జారి చేసింది. ఇదే కేసులో చికోటితో పాటు పలువురు రాజకీయ ప్రముఖలను విచారించారు ఈడీ అధికారులు. ఈ కేసును ఇంకా కొనాసాగుతోంది.
ఈడీ విచారణ తర్వాత చికోటీ పేరు మార్మోగిపోయింది.ఆయన లైఫ్ స్టైల్, ఆయన ఫాంహౌస్‌లో ఏర్పాటు చేసిన మినీ జూ వంటి అంశాలతో పాపులర్ అయిపోయాడు. అప్పటి నుంచి నిత్యం హల్చల్ చేస్తున్నాడు. ఈ మధ్య హింధూ ధర్మం కోసం అంటూ కార్యక్రమాలు చేయడం, పలువరు రాజకీయ నేతలతో భేటీ అవుతున్నారు. రాజకీయాల్లోకి వస్తాను అని కూడా పలుమార్లు పరోక్షంగా వెల్లడించారు. ఈ క్రమంలో మరోసారి ఆయన ఐటీ శాఖ నుంచి నోటీసులు అందుకోవడం చర్చనీయాంశంగా మారింది.