13 ఏళ్ల బాలికను పెళ్లి చేసుకున్న ఇద్దరు పిల్లల తండ్రి
నాగరిక సమాజం పెరుగుతున్నా ఇంకా అనాగరిక పోకడలు మాత్రం ఆగడం లేదు. ఓ వ్యక్తి ఏకంగా తన కూతురు వయస్సున్న చిన్నారిని పెళ్లి చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఈ బాల్య వివా ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 37 ఏళ్ల వయసు ఉన్న ఆ వ్యక్తి బాలిక తల్లిదండ్రుల పేదరికాన్ని ఆసరాగా చేసుకొని పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో ఆ ప్రబుద్ధుడు ఎవరికి చిక్కకుండా పారిపోయాడు. దీంతో బాలిక తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి అతడి కోసం గాలింపు చేపట్టారు.
ఫరూక్‌నగర్ మండలంలోని అయ్యవారిపల్లి గ్రామానికి చెందిన మల్లేశ్ షాద్‌నగర్‌లో ఓ మద్యం దుకాణంలో పని చేస్తుంటాడు. అతని భార్య కొంతకాలం క్రితం మరణించింది. అప్పటికే అతనికి పదేళ్ల కొడుకు, ఎనిమిదేళ్ల కూతురు కూడా ఉంది. అయినా అవేవి పట్టించుకోకుండా అదే గ్రామానికి చెందిన ఓ కూలీ కూతురుపై కన్నేశాడు. వారికి మాయమాటలు చెప్పి తన దారికి తెచ్చుకున్నాడు. ఎవరికి తెలియకుండా ఈ నెల 15న రహస్యంగా పెళ్లి తంతు పూర్తి చేశారు. ఈ విషయం అధికారులు రంగంలోకి దిగారు. దీంతో పరారీలో ఉన్న మల్లేష్ కోసం గాలిస్తున్నారు. ఇంకోసారి ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు. మల్లేష్ చేసిన పనిపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.