లాక్‌డౌన్‌ను అలా వాడేశారు.. 41 మంది అరెస్ట్ - MicTv.in - Telugu News
mictv telugu

లాక్‌డౌన్‌ను అలా వాడేశారు.. 41 మంది అరెస్ట్

October 6, 2020

Child pornography spiked during lockdown, 41 arrested in Kerala: Cops

బయట కరోనా మహమ్మారి ఉందని లాక్‌డౌన్ విధించి ఇళ్లల్లో ఉండమంటే చాలామంది ఫోన్లకే పరిమితం అయ్యారు. ఈ క్రమంలో చాలామంది ఆన్‌లైన్‌లో ఎక్కువ సమయం గడిపి శారీరక వ్యాయామాలకు దూరం అయ్యారు. అలాగే కొంతమంది కుటుంబ సభ్యులతో కూడా మనసు విప్పి మాట్లాడకుండా ఫోన్లకే అంకితం అయ్యారు. ఇది ఒక వైపు అయితే కొంతమంది ఫోన్లలో పోర్నోగ్రఫీ చూశారు. కొందరు అంతకుమించి చిన్న పిల్లల ఆశ్లీల వీడియోలు, ఫోటోలను ఆన్‌లైన్‌లో షేర్‌ చేశారు. ఈ మేరకు కేరళలో 41 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఎక్కువగా ఐటీ ఉద్యోగులు, వివిధ ఉద్యోగాల్లో పనిచేసేవారు ఉండటం పోలీసులను ఆశ్చర్యానికి గురిచేసింది. కరోనా కష్ట కాలంలో చిన్నారులపై లైంగిక దోపిడీ పెరిగిందనే ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలో కేరళ సైబర్ సెల్ వీటిపై నిఘా పెంచింది. కేరళ పోలీసుల ఆధ్వర్యంలో సైబర్‌డోమ్ సహాయంతో ఆపరేషన్ పి హంట్ 20.2లో భాగంగా ఆదివారం హైటెక్ దర్యాప్తు కొనసాగించి ఆ 41 మందిని అరెస్ట్ చేశారు. 

అరెస్ట్ అయిన నిందితులు వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌, టెలిగ్రామ్‌ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో కరోనా లైఫ్‌, ఇతర పేర్లు పెట్టి చైల్డ్ పోర్నోగ్రఫీ ఫోటోలను, వీడియోలను షేర్‌ చేస్తుంటారు. మరోవైపు రాష్ట్రంలో మొత్తం 362 ప్రాంతాల్లో దాడులు నిర్వహించగా.. మొత్తం 268 మందిపై కేసులు నమోదుచేశారు. కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు, హార్డ్‌డిస్క్‌లను ఈ ఆపరేషన్‌లో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డార్క్‌నెట్‌ వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించి పోర్నోగ్రఫీ చిత్రాలను చూసి, వాటిని షేర్‌ చేయడం, డౌన్‌లోడ్‌ చేయడం వంటి ఆరోపణలపై నిందితులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. కాగా, వారు చేసిన నేరానికి ఐదేళ్ల పాటు జైలుశిక్ష, రూ.10 లక్షల వరకు జరిమానా విధించనున్నారు. ఈ నేరాల వెనుక బడాబాబుల ప్రమేయంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.