బాలయ్య కన్నుమూత.. టాలీవుడ్‌లో విషాదం - MicTv.in - Telugu News
mictv telugu

బాలయ్య కన్నుమూత.. టాలీవుడ్‌లో విషాదం

April 9, 2022

 

003

టాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ నటుడు బాలయ్య (94) కన్నుమూశారు. తెలుగు సినిమాకు యాభై దశాబ్దాలకుపైగా సేవలందించిన బాలయ్య ఆనారోగ్యంతో శనివారం తుది శ్వాస విడిచారు. 1930 ఏప్రిల్ 9న ఆయన గుంటూరు జిల్లా చావపాడులో జన్మించారు. మెకానికల్ ఇంజనీరింగ్‌లో పట్టభద్రుడైన బాలయ్య.. ‘ఎత్తుకు పై ఎత్తు’ అనే సినిమాతో నటుడిగా తెలుగు తెరకు పరిచయమైయ్యారు. హైదరాబాద్ యూసఫ్ గూడలోని తన స్వగృహంలో ఆయన తుదిశ్వాస విడిచారు.

బాలయ్య.. నటుడిగా 300కిపైగా చిత్రాల్లో నటించారు. ఎత్తుకు పై ఎత్తు చిత్రంతో నటుడిగా, నిర్మాతగా, దర్శకుడుగా, కథా రచయితగా తన ప్రతిభను చూపారు. ఆయన నిర్మాతగా ‘అమృత ఫిల్మ్స్’ సంస్థ ద్వారా శోభన్ బాబు హీరోగా శుభం చెల్లెలి కాపురం, కృష్ణ , కె విశ్వనాధ్ కాంబినేషన్లో నేరము – శిక్ష, చుట్టాలున్నారు జాగ్రత్త, చిరంజీవి హీరోగా నటించిన ఊరికిచ్చిన మాట లాంటి చిత్రాలు బాలయ్య నిర్మించారు. అంతేకాకుండా బాలయ్య దర్శకుడిగా కూడా తన ప్రతిభను నిరూపించుకున్నారు. పసుపు తాడు, నిజం చెబితే నేరమా, పోలీసు అల్లుడు రూపొందించారు. ఉత్తమ కథా రచయితగా.. ఊరికిచ్చిన మాట చిత్రానికి నంది అవార్డు అందుకున్నారు. చెల్లెలి కాపురం చిత్రానికి నిర్మాతగా నంది అవార్డు అందుకున్నారు. బాలయ్య కుమారుడు తులసీరామ్ కూడా కొన్ని చిత్రాల్లో కథానాయకుడిగా నటించారు. బాలయ్య మరణం పట్ల సినిమా పరిశ్రమ ప్రగాఢ సంతాపం తెలిపింది.