మహాతల్లి.. 1300 కుక్కలు పెంచుకుంటోంది.. - MicTv.in - Telugu News
mictv telugu

మహాతల్లి.. 1300 కుక్కలు పెంచుకుంటోంది..

December 10, 2020

China animal rescuer shares home with 1,300 dogs.jp

జంతువులను పెంచుకోవడం ఓ సరదా. వాటితో గడిపితే టైంపాస్ కావడమే కాకుండా, మన తెలివి కూడా పెరుగుతుందని కొన్ని పరిశోధనలు తేల్చి చెప్పాయి. విదేశాల్లోనే కాకుండా మన దేశంలోనూ పెంపుడు జంతువుల సంఖ్య బాగా పెరిగింది. వాటిపై ఎంత ప్రేమ ఉన్నా ఒకటి రెండు జంతువులకంటే ఎక్కువ పెంచుకోలేం కదా. ఇంటికో కుక్క.. లేకపోతే పిల్లి. మహా అయితే రెండు కుక్కలతో సరిపెట్టుకుంటాం. 

కానీ ఓ మహాతల్లి ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 1300 కుక్కలను పెంచుకుంటోంది. అంతే కాదండోయ్.. ఆవిడ ఇంట్లో వందకుపైగా పిల్లులు, నాలుగు పెద్ద గుర్రాలు కూడా ఉన్నాయి. చైనాలోని చాంగ్‌కింగ్ నగరానికి చెందిన వెన్ జున్హోంగ్ అనే బామ్మ వింత కథ ఇది. 

68 ఏళ్ల వెన్‌కు జంతువులంటే పిచ్చి ప్రేమ. 20 ఏళ్ల కిందట ఆమె ఓ వీధికుక్కను కాపాడింది. అప్పట్నుంచి కుక్కలపై ప్రేమ తెగ పెరిగిపోయి ఇల్లంతా కుక్కల కొంపగా మారిపోయింది. అన్నేసి జంతువులను సాకడం మామూలు విషయం కాదు కదా. వెన్ రోజూ పొద్దున 4 గంటలే నిద్ర లేస్తుంది. కుక్కల మలమూత్రాలను 30 డబ్బాల్లో ఎత్తి పారేస్తుంది. తర్వాత 500 కిలోల అన్నం వండుతుంది. కుక్కలు వట్టి అన్నమే తినవు కనుక వారికి మాంచి కర్రీలు కూడా తయారు చేస్తుంది వెన్. అన్నం, కూరలు, కాస్త మాంసం, బిస్కెట్లు, నానా తిండి కలగలిపి కుక్కలకు, పిల్లులకు ప్రేమగా పెడుతుంది. తర్వాత గుర్రాలకు గడ్డిపెడుతుంది. 

చుట్టుపక్కల వాళ్లు వెన్ జంతుప్రేమను చూసి నవ్వుకుంటూ ఉంటారు. పిచ్చిది అని వెక్కిరిస్తుంటారు కూడా. అయినా ఆమె లెక్క చేయదు. ‘నన్ను ఎవరేమన్నా పట్టించుకోను. ఈ భూమి కేవలం మనుషులదే కాదు. కుక్కులదీ, పిల్లులదీ కూడా. కష్టాల్లో ఉన్న ప్రాణులు కాపాడడం మనిషి ధర్మం…’ అని అంటుంది. 

వెన్ పెంచుకుంటున్న కుక్కల్లో కొన్ని కుంటివి, గుడ్డివి కూడా ఉన్నాయి. వందల జంతువులను సాకడానికి చాలా డబ్బులు కావాలి కదా. అంతే వెన్ ఓ ఇంటిని అమ్మేసింది. మరో ఇంటిని బ్యాంకుకు తాకట్టు పెట్టి అప్పు చేసింది. తన జీవితాన్ని కుక్కలకే అంకితం చేస్తానని ఆమె బల్లగుద్ది మరీ చెబుతోంది!