సరిహద్దులో పంజాబీ పాటలు.. చైనా సైనికుల పన్నాగం - MicTv.in - Telugu News
mictv telugu

సరిహద్దులో పంజాబీ పాటలు.. చైనా సైనికుల పన్నాగం

September 17, 2020

nbnb

భారత్-చైనా సరిహద్దులో గత కొన్ని రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నేలగొన్నాయి. చైనా సైనికులు పాల్పడుతోన్న కవ్వింపు చర్యలను భారత ఆర్మీ సమర్థవంతంగా ఎదురుకొంటుంది. వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి, భారీ ఎత్తున ఆయుధాలతో ఉన్న రెండు దేశాల సైన్యాల మధ్య తరచూ గాల్లోకి కాల్పులు జరుగుతున్నాయి. ఆగస్టు 29 నుంచి కనీసం నాలుగు మార్లు ఇరు వైపుల నుంచి గాల్లోకి తూటాలు పేలాయి. ఈ క్రమంలో చైనా ఆర్మీ కొత్త పన్నాగాలకు పాల్పడుతోంది. చైనా సైనికులు సరిహద్దులకు లౌడ్ స్పీకర్లను తీసుకుని వచ్చి భారత సైనికులకు పంజాబీ పాటలను వినిపిస్తున్నారు. అలాగే హిందీలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. 

దీని గురించి భారత ఆర్మీ సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘చైనా సైనికుల పన్నాగాలు భారత సైనికులు రెచ్చిపోవడం లేదు. చైనా సైనికులు వినిపిస్తున్న సంగీతాన్ని మన సైనికులు ఆస్వాదిస్తున్నారు. చైనా సైన్యం మన జవాన్లలో అసంతృప్తిని పెంచి, వారిని రెచ్చగొట్టాలని చూస్తోంది. యుద్ధతంత్రం తెలిసిన మన జవాన్ల మానసిక స్థితి చైనా పన్నాగాలకు లొంగడం లేదు.’ అని తెలిపారు. భారత సైన్యం మంచు కొండల్లోని అత్యంత ఎత్తయిన ప్రాంతాలను ఆక్రమించి, అక్కడికి ఆయుధ సామాగ్రిని తరలించడంతో, చైనా దళాలు వెనుకంజ వేశాయని ఉన్నతాధికారులు వెల్లడించారు. పాంగాంగ్, ట్సో చుసుల్ ప్రాంతాల్లో మన సైన్యం, చైనా కన్నా ఎంతో ఎత్తులో ఉందని తెలిపారు.