ముఖం స్కాన్ చేసి ఫోన్ వాడాలి.. చైనాలో కొత్త చట్టం.. - MicTv.in - Telugu News
mictv telugu

ముఖం స్కాన్ చేసి ఫోన్ వాడాలి.. చైనాలో కొత్త చట్టం..

December 1, 2019

మొబైల్ వాడకంలో చైనా ప్రభుత్వం కొత్త చట్టాన్ని అమలులోకి తీసుకువచ్చింది.చైనాలో కొత్తగా మొబైల్‌ సర్వీస్‌ను వినియోగించాలంటే ముఖాన్ని స్కాన్‌ చేసి రిజస్టర్‌ చేసుకోవాలి. ఈ నిబంధనను సెప్టెంబర్‌లో చైనా ప్రభుత్వం ప్రకటించగా.. నేటి నుంచి అమలు పరుస్తోంది. దీనిపై ప్రభుత్వం మాట్లాడుతూ ‘ప్రజలకు సైబర్‌ ప్రపంచంలో ఉన్న హక్కులు, అవకాశాలను ఈ చట్టం రక్షిస్తుంది’ అని తెలిపింది. కొత్త మొబైల్‌ కొన్నప్పుడు, మొబైల్‌ డేటా కాంట్రాక్టులను తీసుకున్నప్పుడు ప్రజలు వారి జాతీయ గుర్తింపు కార్డును చూపించాల్సి ఉండేది. కానీ, ఇక నుంచి ఐడీతోపాటు వారి ముఖాన్ని స్కాన్‌ చేస్తారు. ఈ సందర్భంగా వారు ఇచ్చిన ఐడీ సరైందో కాదో గుర్తించే అవకాశం ఉంది. 

China

మరోవైపు చైనా చాలా రోజుల నుంచి అక్కడి ప్రజలు అసలు పేరుతోనే ఇంటర్నెట్‌ వినియోగించేలా నిబంధనలను కఠినతరం చేస్తోంది. అక్కడ ఎవరైనా ఆన్‌లైన్‌లో కొత్త విషయాన్ని పోస్టు చేయాలన్నా వారి అసలైన ఐడీని వెల్లడించాలని 2017లో నిబంధన పెట్టింది. టెలికామ్‌ సంస్థల కోసం అమల్లోకి తెచ్చిన ఈ ఫేస్ స్కానింగ్‌ నిబంధన ఇంటర్నెట్‌ వినియోగదారులకు సంబంధించి సమాచారం ప్రభుత్వం సేకరించడానికి వీలుగా తయారు చేశారు. చైనాలో అత్యధిక మంది వినియోగదారులు మొబైల్‌ నుంచే ఆన్‌లైన్‌లోకి వస్తుంటారు.

కాగా, చైనా ఇప్పటికే జనాభా లెక్కలకు ఫేషియల్ రికగ్నైజేషన్‌ టెక్నాలజీని వినియోగిస్తోంది. ఈ రకమైన టెక్నాలజీలో మిగిలిన ప్రపంచ దేశాలతో పోలిస్తే చైనా ముందుంది.