కరోనా పుండుపైన కారం.. జర్నలిస్టులను బహిష్కరించిన చైనా - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా పుండుపైన కారం.. జర్నలిస్టులను బహిష్కరించిన చైనా

February 24, 2020

China Expels Three Wall Street Journal Reporters

కరోనా వైరస్‌తో చైనా అతలాకుతలం అవుతోంది. దీనిపై రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో చైనా ప్రభుత్వం తప్పుడు కథనాలు ప్రచురిస్తున్న పత్రికలపై నజర్ పెట్టింది. తప్పుడు ప్రచారానికి పూనుకుంటున్న సదరు పత్రికలపై కఠినంగా వ్యవహరిస్తోంది. చైనా రాజధాని బీజింగ్‌ కేంద్రంగా పనిచేస్తున్న వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ అంతర్జాతీయ పత్రికకు చెందిన ముగ్గురు విలేకరులను చైనా ప్రభుత్వం దేశం నుంచి బహిష్కరించింది. ఫిబ్రవరి 3 వ తేదీన ప్రచురితమైన ఒపీనియన్‌ పీస్‌లో చైనాను ‘ఆసియా ఖండపు నిజమైన రోగి’(China is the Real Sick Man of Asia)గా వాల్‌స్ట్రీట్‌ శీర్షిక పెట్టి ప్రచురించింది. ఈ కథనంపై చైనా ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనిపై చైనా విదేశాంగ శాఖ వాల్‌స్ట్రీట్‌ బ్యూరో చీఫ్‌ జోష్‌ చిన్‌, రిపోర్టర్‌ చావో డెంగ్‌ను దేశం వదిలి వెళ్లాలని ఆదేశాలు జారీచేసింది. కాగా, వారిద్దరు అమెరికా పౌరులు కాగా వారితో పాటు ఆస్ట్రేలియాకు చెందిన రిపోర్టర్‌ ఫిలిఫ్‌ వెన్‌ను కూడా 5 రోజుల్లో దేశం విడిచి వెళ్లిపోవాలంది. 

దీని గురించి చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి జన్‌షాంగ్‌ మాట్లాడుతూ.. ‘వాల్‌స్ట్రీట్‌ పత్రిక వివక్షను చూపుతూ అలాంటి శీర్షికను పెట్టింది. బాధ్యతరహితంగా వ్యవహరించింది. చైనా ప్రజలు ఈ విషయాన్ని హర్షంచడంలేదు. దీనిని చైనాపై చేస్తున్న దాడిగా భావిస్తున్నాం’ అని మండిపడ్డారు. తర్వాత వాల్‌స్ట్రీట్‌ సీఈఓ స్పందిస్తూ.. ‘అభిప్రాయాన్ని తెలిపే సిబ్బంది, వార్తలు అందించే సిబ్బంది వేరుగా ఉంటారు. ఆ వార్తతో జర్నలిస్టులకు సంబంధం లేనివారిని బహిష్కరించడం విచారకరం. దీనిపై మరోసారి పునరాలోచించాల్సిందిగా విదేశాంగశాఖ మంత్రిని అభ్యర్ధిస్తున్నాం’ అని అన్నారు.