చైనా మాల్ కు గ్యారంటీ లేదు గ్యారంటీ లేదు అన్కుంటనే మనదేశంల చైనావోని బిజినెస్ డెవ్ లప్ గానీకి బాగనే సహకరించినం మనం.మీరు ఏ దుకాన్లకన్న పోన్రి నాల్గు వస్తువులల్ల ఖచ్చితంగ రొండో మూడో చైనా వస్తువులే ఉంటయ్,మనం ఇరవై నాల్గుగంటలు శేతుల వట్టుకొనే ఫోన్ దగ్గరనుంచి ఇంట్ల వాడే అన్ని వస్తువులదాక దగ్గరి దగ్గర అన్ని చైనాయే ఉంటయ్,అగో చైనా వోడు ఇండియా మార్కెట్లల్ల శెట్టు వేర్ల లెక్క పాక్కపోయిండు.ధర తక్కువ పీచర్లు ఎక్కువ అనే కాన్సెప్ట్ తోని చైనావోడు మనదేశంనుంచి బాగనే పైసలు లావట్కపోతుండట.
కనీ ఇప్పుడు సోషల్ మీడియాల,నల్గురు గల్శి ముచ్చట వెట్టినా ఏడ జూశ్న చైనా వస్తువులను బ్యాన్ జెయ్యాలే,చైనా వోని వస్తువులు వాడద్దు,వాడు తయారుజేశేవన్ని మనదేశంలోనే తయారు జేస్కోవాలే,చైనా ఉత్పత్తులను మనదేశంలోకి రాకుంట జూడాలే అని బాగనే డిమాండం చేస్తున్నరు.కొందరైతే చైనా వస్తువులమ్మే దుకాన్లమీద దాడి చేస్తున్నరు.చైనా వస్తువుల మీద దండయాత్ర శుర్వైంది అనే చెప్పాలి.
ప్రధాని నరేంద్ర మోడీ ‘మేకిన్ ఇండియా’లో భాగంగా ఆయా ఉత్పత్తులను మన దేశంలోనే తయారు చేసుకోవాలనే చాలామంది తమ గొంతును వినిపిస్తున్నరు. చైనాను దెబ్బ తీయాలంటే.. చైనా దిగుమతులను నిషేధించాలని, కుదరని పక్షంలో టాక్స్ లను భారీగా పెంచాలని పలువురు డిమాండ్ చేస్తున్నరు. ఈ నేపథ్యంలో చైనాకు చెక్ చెప్పేందుకు క్రమంగా ప్రభుత్వం కూడా ఈ దిశగా కదులుతోంది.ఇండియాకు చీప్‌గా ఎలక్ట్రానిక్స్ఐటీ ఉత్పత్తులను ఎగుమతి చేస్తూ..
ఇక్కడి మార్కెట్‌ను పూర్తిగా కబ్జా చేసేసిన చైనాకు చెక్ పెట్టాలని కేంద్ర ప్రభుత్వం కూడా భావిస్తున్నది.వీటి ద్వారా భద్రతతోపాటు ఇతర కీలక విషయాలు లీకవుతున్నాయని భావిస్తున్న కేంద్రం.. చైనా ఎలక్ట్రానిక్స్,ఐటీ ఉత్పత్తుల దిగుమతులను పునఃసమీక్షించాలని నిర్ణయించింది. డోక్లామ్‌లో రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో భారత్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
భారత్‌లో చైనా ఎలక్ట్రానిక్స్,ఐటీ ఉత్పత్తుల విలువ 2200 కోట్ల డాలర్లుగా ఉందని సీఐఐ వెల్లడించింది. ఇంత భారీ మొత్తం చూసి ప్రభుత్వం కూడా కంగుతిన్నది. వీటివల్ల ఇక్కడి వ్యక్తులు,వ్యాపారాలు,ప్రభుత్వ విభాగాల కీలక సమాచారం చైనాకు లీక్ అవుతున్నదని ప్రభుత్వం భావిస్తున్నది. ముఖ్యంగా రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో ఇది మంచిది కాదు అని ప్రభుత్వంలోని సీనియర్ అధికారి వెల్లడించారు. ఇక చైనాతో పెద్ద ఎత్తున ఉన్న వాణిజ్య లోటు కూడా ప్రభుత్వాన్ని ఈ దిశగా ఆలోచించేలా చేస్తున్నది.