China interference in Canada PM Trudeau alert world
mictv telugu

కెనడా ఇంట్లో తోక పెట్టిన చైనా డ్రాగన్..

November 8, 2022

అమెరికా, సోవియట్ రష్యాలు బలంగా ఉన్నప్పుడు మిగతా దేశాలకు మరో ఆప్షన్ లేక వాటిలో ఏదో ఒక దాని పంచన చేరేవి. రష్యా బలహీనపడి ప్రచ్ఛన్న యుద్ధం ముగిశాక, కండబలమున్నోడిదే రాజ్యమైంది. కమ్యూనిస్టు చైనా, టెక్నాలజీ దిగ్గజాలు జర్మనీ, జపాన్ వంటి దేశాలు ప్రపంచ రాజకీయ చిత్రపటంపై ఆధిక్యం చాటుకుంటున్నాయి. ఇరుగు పొరుగు దేశాల్లోనే కాదు, సుదూర దేశాల్లో సైతం పాగా వేసి, తమ ప్రయోజనాలను కాపాడుకుంటున్నాయి. ఒకప్పుడు అమెరికా, సోవియట్ రష్యాలు పాటించిన ఈ విధానాన్ని ఇప్పుడు చైనా కూడా అనుసరిస్తోంది. భారత్ పక్క దేశాలైన పాకిస్తాన్, శ్రీలంకకు ఉదారంగా సాయం చేస్తూ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్న చైనా ఈసారి వేల కి.మీ. దూరంలోని కెనడా అంతర్గత విషయాల్లోనూ తలదూర్చడం కలకలం రేపుతోంది.

ఏమిటి ఆరోపణలు?

చైనా తమ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకుంటోందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడూ ఆరోపించారు. 2019 కెనడా ఎన్నికల్లో చైనా తనకు అనుకూలమైన 19 మంది అభ్యర్థులను నిలబెట్టిందని ఆరోపణ. కెనడా ప్రజాస్వామ్యాన్ని బలహీన పర్చడానికి బీజింగ్ కుట్రలు పన్నినట్లు వార్తలు వస్తున్నాయి. చైనా కమ్యూనిస్టు పార్టీతో అనుబంధమున్న అభ్యర్థులకు భారీగా డబ్బులు ముట్టాయని కెనడా నిఘా వర్గాల కథనం. వారిని పార్లమెంటకు పంపి కెనడా ప్రభుత్వ విధానాలు తమకు అనుకూలంగా ఉండేలా చూసుకోవాలన్నది డ్రాగన్ కుట్ర. ఓ ఎంపీ విషయంలో రెండున్నర లక్షల డాలర్ల సొమ్ము చేతులు మారిందని చెబుతున్నారు. అయితే దౌత్య అవినీతి కేసులతో పోలిస్తే ఇది చాలా తక్కువ డబ్బే. 2019 ఎన్నికల్లో నిలబడిన పలువురు అభ్యర్థులు చైనాకు చెందిన యునైటెడ్ ఫ్రంట్ వర్క్ డిపార్ట్మెంట్ అధికారులతో భేటీ అయి మంతనాలు జరిపారని కెనడా నిఘా వర్గాలు చెబుతున్నాయి. కెనడాలో చైనా రహస్యంగా పోలీస్ స్టేషన్లు కూడా నడుపుతోందని మరో ఆరోపణ. ఈ ఆరోపణలపై చైనా ఇంతవరకు స్పందించలేదు.

కమ్యూనిస్టు పార్టీకి అదో అలవాటు..

చైనా ప్రభుత్వం, కమ్యూనిస్టు పార్టీ వేరు కాదు. ప్రపంచంపై పట్టు సాధించడానికి పార్టీ ప్లస్ ప్రభుత్వం ఏకమై పనిచేస్తుంటాయి. పలు దేశాల అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకుని పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకోవడం చైనా లక్ష్యం. దీని కోసం లంచాలు, హనీట్రాప్ వంటి వలలు విసురుతుంటుంది. చైనా వ్యాపార ప్రయోజనాలతోపాటు, తమ దేశంలో నేరాలకు పాల్పడి విదేశాలకు పారిపోయిన వారిని పట్టుకోవడం, దలైలామా వంటి వేర్పాటువాదులపై నిఘా ఉంచడం, దేశ భద్రత వంటి ఎన్నో ఉద్దేశాలు దీనికి వెనక ఉంటాయి. బలం, వనరులు ఉన్న ఏ దేశమైనా ఇలాంటి జోక్యాలు చేసుకోవడం సాధారణమేనన్నది పరిశీలకుల మాట. కెనడా నిఘా వర్గాలు బలహీనంగా ఉన్నాయని, అందుకే చైనా జోక్యం వీలైందని చెబుతున్నారు.