China Manja slits baby's neck on Nagole flyover
mictv telugu

నాగోల్ ఫ్లైఓవర్ పై పాప మెడ కోసిన చైనా మాంజా

January 13, 2023

China Manja slits baby's neck on Nagole flyover

సంక్రాంతి సందర్భంగా సాంప్రదాయం ప్రకారం పతంగులు ఎగురవేయడం ఆనవాయితీ. అయితే మామూలు దారం కాకుండా చైనా మాంజా వాడుతుండడంతో ప్రతీ సంవత్సరం విషాద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మనుషులతో పాటు పక్షులకు కూడా చైనా మాంజా ప్రమాదకరంగా పరిణమించడంతో ప్రభుత్వం దాన్ని నిషేధించింది. అయినా కొందరు వ్యాపారులు విక్రయిస్తుండడంతో మార్కెట్లో విరివిగా దొరుకుతోంది.

తాజాగా పండుగ ప్రారంభ సమయంలో చైనా మాంజ ఓ పాప మెడను కోసేసిన ఘటన విషాదాన్ని నింపింది. ఓ కుటుంబం బైకుపై సొంతూరికి నాగోల్ ఫ్లై ఓవర్ మీదుగా వెళ్తుండగా, చైనా మాంజా నాలుగేళ్ల చిన్నారి మెడకు చుట్టుకుంది. దాన్ని గమనించేలోపు బైకు కొంచెం దూరం వరకు వెళ్లింది. మాంజా మెడకు బిగుసుకుపోయి పాప గట్టిగా అరవడంతో తల్లిదండ్రులు బైక్ ఆపి చూడగా.. అప్పటికే మెడ భాగం గాయంతో రక్తమోడుతుండం కనిపించింది. వెంటనే సమీప ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. పరిశీలించిన డాక్టర్లు పాప పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు.

చైనా మాంజా ప్రమాదకరమైందని, ఉపయోగించకూడదని పోలీసులు హెచ్చరిస్తున్నా వినియోగం తగ్గట్లేదు. విక్రయించిన వారిపై కేసులు పెట్టి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తున్నారు. ఇలా ఎంత అవగాహన కల్పిస్తున్నా జనాలు మాత్రం మారడం లేదు. ఆనందంగా జరుపుకోవాల్సిన పండుగల్లో ఇలా విషాదం చోటుచేసుకోవడం బాధాకరమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎన్నో సంఘటనలు కళ్లముందు జరుగుతున్నాయి కాబట్టి పౌరులు జాగ్రత్త పడాలని మీడియా ద్వారా అందరికీ మనవి చేస్తున్నాము.