సరిహద్దు వివాదాల నేపథ్యంలో భారత్తో పరోక్ష శత్రుత్వం ఉన్నట్టు భావిస్తున్న చైనా మరోసారి మన దేశాన్ని ప్రశంసించింది. ఇంతకు ముందు గోధుమల ఎగుమతులపై విధించిన నిషేధాన్ని సమర్ధించిన విషయం తెలిసిందే. తాజాగా ఆర్దిక, ఆహార సంక్షోభంలో ఉన్న శ్రీలంక దేశానికి మనం చేసిన సహాయాన్ని అభినందించింది. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి జావో లిజియన్ ఈ మేరకు ప్రకటించారు. ‘శ్రీలంక సంక్షోభ సమయంలో భారత్ పాత్ర ప్రశంసనీయం. శ్రీలంక త్వరగా కోలుకోవడానికి భారత్ చేస్తున్న కృషిని బాగుంది. ఇలాంటి దేశాలు త్వరగా కోలుకోవడానికి భారత్లాగా చైనా కూడా ప్రయత్నిస్తోంది. మా వంతు సహాయంగా లంకకు 500 మిలియన్ డాలర్ల విలువైన సహాయాన్ని ప్రకటించామ’ని వెల్లడించారు. అయితే చైనా విషయంలో శ్రీలంక వాదన మరోలా ఉంది. ‘మాకోసం ఒక బిలియన్ డాలర్ రుణం కోసం అడిగితే ఇవ్వలేదు. కనీసం 1.5 బిలియన్ డాలర్ల క్రెడిట్ లైన్ కూడా మేం చైనా నుంచి పొందలేకపోయాం’ అంటూ ఆ దేశ అధ్యక్షుడు రాజపక్స వాపోయారు.