కరోనా వైరస్ను తయారుచేసినట్లు ప్రపంచం ఎదుట దోషిగా నిలబడ్డ చైనా బెంబేలెత్తిపోతోంది. దేశంలో కోవిడ్ కేసులు వేలల్లో, లక్షల్లో కాదు కోట్ల సంఖ్యలో నమోదవుతున్నాయి. అలాంటిదేమీ లేదని డ్రాగన్ కంట్రీ చెబుతున్నా వీడియోలు, ఫొటోలు, స్వతంత్ర సంస్థల నివేదికలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నారు. చైనాలో గతవారంలో రోజుకు సగటున 3.7 కోట్ల కేసులు నమోదైనట్లు వార్తలు వస్తున్నాయి. కోవిడ్ కేసుల్లో ఇదే ఇప్పటివరకు ప్రపంచ రికార్డు. వివిధ కథనాల ప్రకారం.. డిసెంబర్ 1 నుంచి 20 తేదీ లోపల 25 కోట్ల మందికి వైరస్ సోకింది. దేశ జనాభాలో ఇది 18 శాతం. కేసుల వ్యాప్తిపై చైనా నేషనల్ హెల్త్ కమిషన్ అత్యవసరంగా సమావేశమై నియంత్రణ చర్యలకు సంకల్పించింది. కరోనా విచ్చలవిడిగా పెరిగిన రోజుల్లోనే రోజుకు 40 లక్షల కేసులు నమోదయ్యేవని, ఇప్పుడు 3 కోట్ల దాటిందంటే పరిస్థితి పూర్తిగా దిగజారిందని ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
చైనాలో వచ్చే మూడు నెలల్లో ఏకంగా 80 కోట్లమందికి కోవిడ్ సోకనుందని అమెరికాకు చెందిన ఎరిక్ ఫీగల్ డింగ్ అనే అంటువ్యాధుల నిపుణుడు, ఆరోగ్య విషయాల ఆర్థిక నిపుణుడు ఇటీవల హెచ్చరించాడు. చైనాలో ఇప్పటికే వేల కేసులు నమోదై, ఆస్పత్రులు రోగులతో కిక్కిరిసిన నేపథ్యంలో డింగ్ హెచ్చరిక ప్రాధాన్యం సంతరించుకుంది. ‘‘చైనా జనాభాలో 60 శాతం మంది కరోనా బారిన పడబోతున్నారు. అంటే భూమిపై ఉన్న జనాభాలో 10 శాతం మందికి జబ్బు సోకనుంది. మరణాలు పదుల లక్షల్లోనే ఉంటాయి. అయినా చైనాకు ఏమీ పట్టడం లేదు’’ అని డింగ్ చెప్పారు.