China Reports 60,000 COVID lives loss Says Peak Passed
mictv telugu

చైనాలో నెలలో 60 వేల కరోనా మరణాలు.. నిజమే..

January 14, 2023

China Reports 60,000 COVID lives loss Says Peak Passed

కరోనా వైరస్‌ను తయారుచేసి ప్రపంచమ్మీదికి విడిచిపెట్టినట్లు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న చైనా ఇప్పుడు ఆ కరోనాతోనే విలవిల్లాడుతోంది. కేసుల సంఖ్య కోట్లలోనే ఉంది. అయితే అంతా అబద్ధమని, కొన్ని కేసులు, కొన్ని మరణాలే నమోదవుతున్నాయని బుకాయిస్తూ వస్తున్న డ్రాగన్ కంట్రీ ఎట్టకేలకు నిజం చెప్పింది. నెలా ఐదు రోజుల్లో తమ దేశంలో 60వేల మందికిపైగా చనిపోయారని అధికారికంగా ప్రకటించింది. తీవ్ర దశను దాటిపోయామని, వ్యాధి అదుపులోనే ఉందని పేర్కొంది. అయితే ఈ సంఖ్య లక్షల్లోనే ఉంటుందని, తీవ్రతను తగ్గించి చూపడానికి ఏదో ఒకటి చెప్పాలని ఈ లెక్క చెప్పిందని పాశ్చాత్య దేశాలు మండిపడుతున్నారు.

గత ఏడాది డిసెంబర్ 7 నుంచి ఈ నెల 12 వరకు తమ దేశంలో 60వేల మంది కరోనాతో చనిపోయినట్లు చైనా అధికారులు తెలిపారు. శ్వాసకోశ సమస్యలు తీవ్రమై 5 వేలమంది, మిగతా పేషంట్లు ఇతరత్రా అనారోగ్య కారణాలతో ప్రాణాలు కోల్పోయారని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ వెల్లడించింది. అయితే ఇవన్నీ ఆస్పత్రుల్లో రికార్డయిన మరణాలు మాత్రమేనని, ఇళ్లలోనూ కొందరు చనిపోయి ఉండొచ్చని పేర్కొంది. చైనా జనాభాలో 64 శాతం మందికి (90 కోట్లు) కోవిడ్ సోకిందని పెకింగ్ యూనివర్సిటీ అధ్యయనంలో తేలింది. అయితే అధికారికంగా ఈ లెక్కను ప్రభుత్వం అంగీకరించడం లేదు. ఇంత భారీ స్థాయిలో సోకడం వెనక ‘హెర్డ్ ఇమ్యూనిటీ’ ప్రోగ్రామ్ వంటిది ఏదైనా ఉందేమోనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందరికీ వైరస్ సోకాక, టీకాలు అందజేసి వ్యాధిని శాశ్వతంగా నిరోధించాలనే ప్లాన్ తో చైనా ఉందేమోనని కథనాలు వస్తున్నాయి.