కరోనా వైరస్ కారణంగా డ్రాగన్ కంట్రీ చైనాకు పిచ్చి ముదిరి పాకాన పడుతున్నట్టే ఉంది. కరోనా విషయంలో ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేని చైనా, మొన్న కరోనాను అసలు మేము కాదు అంటించింది.. అంతకుముందునుంచే కరోనా ఉందని చిలుక పలుకులు పలికింది. తాజాగా లద్దాఖ్ విషయంలో దుందుడుకుగా వ్యవహరిస్తూ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం సృష్టిస్తోన్న చైనా మరోమారు అలాంటి పలుకులే పలికింది. లద్దాఖ్‌ను తాము గుర్తించలేదని పాడిన పాటే పాడుతోంది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు భారతే కారణమంటూ వాదిస్తోంది. లద్దాఖ్, అరుణాచల్‌ప్రదేశ్ సహా పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వ్యూహాత్మకంగా నిర్మించిన 44 వంతెనలను భారత్ సోమవారం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ నిర్మాణాలను చూసి ఓర్వలేకపోతున్న చైనా మళ్లీ భారత్‌పై విషం చెమ్మే కామెంట్లు చేసింది.
అరుణాచల్‌ప్రదేశ్, లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతాన్ని చైనా గుర్తించలేదని ఈ మేరకు ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావో లిజియాన్ మంగళవారం మీడియా ముందు చెప్పారు. ‘వివాదాస్పద సరిహద్దు ప్రాంతాల్లో సైనిక నిఘా నిమిత్తం భారత్ చేపట్టిన మౌలిక సదుపాయాల వంతెనలను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. సరిహద్దు ప్రాంతాల్లో వివాదాలకు తావిచ్చే ఎలాంటి చర్యలను ఉభయ దేశాలు చేపట్టరాదని ఇటీవల భారత్, చైనా చేసుకున్న ఒప్పందం గురించి మరిచిపోయారా?’ అని ప్రశ్నించారు.