తవాంగ్ గొడవ సరిపోలేదనుకుంటా చైనాకు….ఇంకా కయ్యానికి కాలు దువ్వుతూనే ఉంది. మళ్ళీ భారత్ మీద దాడి చేయడానికి సన్నాహాలు చేస్తోంది. టిబెట్ లోని తన స్థావరాల్లో బోలెడు డ్రోన్లు, యుద్ధ విమానాలను దించింది. ఉపగ్రహాలతో తీసిన ఫోటోలలో ఇది స్పష్టంగా కనిపిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుకు 150 కిలోమీటర్ల దూరంలో బంగ్డా వైమానికి స్థావరంలో డబ్ల్యూజడ్-7 సోరింగ్ డ్రాగన్ డ్రోన్ కనిపించింది. ఇది పదిగంటలపాటు ఎగురుతూ ఉండగలదు. అలాగే మొత్తం సమాచారాన్ని క్షిపణులకు అందించగలదు. ఇక షింగాట్సే ఎయిర్ పోర్ట్ లో ఫ్లాంకర్ లాంటి యుద్ధవిమానాలు, కేజే-500 విమానాలు కనిపించాయి. దీన్ని గమనించిన భారత్ వాయుసేన వెంటనే రంగంలోకి దిగింది. గస్తీని పెంచింది. చైనా యుద్ధ విమానాలు మన ఎయిర్ స్పేస్ లోకి రాకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లనూ చేస్తోంది. ఇంతకు ముందు కూడా రెండుసార్లు చైనా విమానాలు భారత్ లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తే మన జెట్ లు వాటిని తరిమేశాయి.
ఈ నెల తొమ్మిదిన చైనా తవాంగ్ లో మన భూభాగంలోకి వచ్చేందుకు ప్రయత్నించింది. వారిని మన సైనికులు అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పుడు రెండు వర్గాల మధ్యా తోపులాట జరిగింది. అదే సమయంలో మరికొంత మంది చైనా బలగం దూసుకువచ్చి భారత సైనికల మీద దాడికి దిగారు. సరిగ్గా అదే సమయంలో ఇండియా క్యూఆర్టీ రంగంలోకి దిగి డ్రాగన్ బలగాలను ముప్పుతిప్పలు పెట్టింది. పెద్దగా రెడీలేని చైనాకు భారత్ దాడి దిమ్మతిరిగేలా చేసింది. మన సైనికులు చైనా వాళ్ళను వెంటపడి మరీ తరిమారు. ఈ దాడిలో చైనా సైనికులు 10 లేదా 15 మంది వరకూ తీవ్రగాయాలు అయ్యాయని, బహుశా వాళ్ళు చనిపోయి కూడా ఉండవచ్చునని భారత సైనికాధికారులు చెబుతున్నారు.