సరిహద్దు ప్రాంతమైన వాస్తవాధీన రేఖ వద్ద చైనా భారీ ఎత్తున మౌలిక సదుపాయాలను నిర్మిస్తోంది. ఎల్ఏసీ నుంచి 100 కిలోమీటర్ల దూరంలో రాకెట్ వ్యవస్థలు, లాంగ్ రేంజ్ శతఘ్నులు, యుద్ధ విమానాల కోసం రన్‌వేల నిర్మాణం చేపట్టింది. ఫైటర్ జెట్లను భద్రపరచడానికి బంకర్లను సైతం ఏర్పాటు చేసింది. ఈ విషయాలను కేంద్రంలోని కీలక అధికారులు మీడియాకు తెలిపారు. వారి వివరాల ప్రకారం.. గల్వాన్ లోయలో ఘర్షణ నెలకొన్నప్పుడు కేవలం 20 వేల మంది సైనికుల కోసం మాత్రమే నిర్మాణాలు ఉన్నాయి. ఈ రెండేళ్లలో చైనా దానిని లక్షా 20 వేలకు పెంచింది. శీతాకాలంలో ఇబ్బందులు లేకుండా ఉండడానికి సౌరశక్తి, హైడల్ ప్రాజెక్టుకలను నిర్మించింది. వీటితో పాటు అత్యాధునిక సౌకర్యాలను చైనా సరిహద్దుకు తరలించింది. ఆధునిక ట్యాంకులు, దళాలను తరలించేందుకు అభివృద్ధి చేసిన వాహనాలు, పేలుళ్లను తట్టుకునేలా బ్లాస్ట్‌పెన్‌లను నిర్మించింది. లాంగ్ రేంజ్ క్షిపణులు, రాకెట్ లాంచ్ వ్యవస్థలు, ఎయిర్ డిఫెన్స్ సిస్టం, 25 ఫైటర్ జెట్లను మోహరించింది.