డ్రాగన్ కవ్విస్తోంది..! - MicTv.in - Telugu News
mictv telugu

డ్రాగన్ కవ్విస్తోంది..!

July 17, 2017

చైనా బరితెగించింది. కయ్యానికి కాలు దువ్వుతోంది. సరిహద్దు సమీపంలో డ్రాగన్ ఆర్మీ లైవ్ ఫైర్ డ్రిల్స్ నిర్వహించింది. సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తతలను మరింత పెంచాలని చూస్తోంది. ఈ మేరకు చైనా అధికారిక చానల్ చైనా సెంట్రల్ టెలివిజన్ (సీసీటీవీ) పేర్కొంది. అయితే ఈ డ్రిల్స్ ఎప్పుడు జరిగాయన్న విషయాన్ని మాత్రం చెప్పలేదు.

చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ, చైనాకు చెందిన రెండు పర్వత బ్రిగేట్లలో ఒకటి ఈ డ్రిల్స్‌లో పాల్గొన్నట్టు గ్లోబల్ టైమ్స్ పత్రిక తెలిపింది. చైనా సైనికులు విన్యాసాలు నిర్వహించిన ప్రదేశంలో బ్రహ్మపుత్రా నది కనిపిస్తుండడంతో ఈ డ్రిల్స్ భారత్‌కు అత్యంత సమీపంలో జరిగి ఉండవచ్చని తెలుస్తోంది. ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తున్న ఈ డ్రిల్స్‌కు సంబంధించిన వీడియో ప్రకారం.. సైనికులు యాంటీ ట్యాంక్ గ్రనేడ్లు, క్షిపణులు, ఫిరంగులు ఉపయోగించి బంకర్లను పేల్చారు. శత్రుదేశ విమానాలను కనుగొనేందుకు రాడార్ యూనిట్లు, లక్ష్యాలను పేల్చివేసేందుకు సైనికులు యాంటీ-ఎయిర్‌క్రాఫ్ట్ ఫిరంగులను ఉపయోగించారు. దాదాపు 11 గంటలపాటు ఈ డ్రిల్ కొనసాగింది.