83 టన్నుల నకిలీ బంగారం.. ప్రపంచంలోనే అతిపెద్ద గోల్డ్ స్కాం  - MicTv.in - Telugu News
mictv telugu

83 టన్నుల నకిలీ బంగారం.. ప్రపంచంలోనే అతిపెద్ద గోల్డ్ స్కాం 

July 4, 2020

 

gold

మెరిసేదంతా బంగారం కాదు. అన్ని సరుకుల్లో నకిలీలు ఉన్నట్టు బంగారంలోనూ కల్తీ బంగారం ఉంటుంది. ఎంత కల్తీ బంగారమైనా అందులో కనీసం సగమో, పాతిక భాగమో అయినా పసిడి ఉండకపోతే. కానీ అలా ఉంటే తమ గొప్ప ఏముంటుందని ఓ చైనా కంపెనీ భారీ గోల్డ్ స్కాంకు తెరలేపింది. ఏకంగా 83 టన్నుల నకిలీ బంగారాన్ని తనఖా పెట్టి దాదాపు 17 వేల కోట్ల రూపాయలన బ్యాంకుల నుంచి అప్పుగా తీసుకుంది. ఆ అప్పులను చెల్లించలేక చేతులు ఎత్తేయడంతో అసలు రంగు బయటపడింది. కైజిన్ అనే మీడియా సంస్థ ఈ గుట్టుబయటపెట్టింది. చైనా ఏటా సగటున 400 టన్నుల బంగారాన్ని ఉత్పత్తి చేస్తోంది. వెలుగు చూసిన నకిలీ బంగారం అందులో 22 శాతం. చైనా బంగారు రిజర్వుల్లో దాని మొత్తం 4 శాతం.  

కరోనాకు అడ్డాగా మారిన చైనాలోని వుహాన్ నగరం కేంద్రంగా ఈ కంపెనీ పనిచేస్తోంది. పేరు కింగ్ గోల్డ్ జువెలరీ కంపెనీ. రియల్ ఎస్టేట్ రంగంలోనూ అడుగుపెట్టిన ఈ కంపెనీ 83 టన్నుల బంగారాన్ని తాకట్టు పెట్టి 14 సంస్థల నుంచి రుణాలు తీసుకుంది. ఈ సొమ్మును కంపెనీ వ్యవస్థాపకుడు జియా జిహోంగ్‌ దారులు మళ్లించి తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ బంగారం నిల్వలకు బీమా పాలసీలు కూడా ఉండడంతో బ్యాంకులకు అనుమానం రాలేదు. గత ఏడాది నుంచి కింగ్ గోల్డ్ అప్పులు చెల్లించకపోవడంతో బంగారం బండారం బయటపడింది. బంగారం బిస్కెట్లుకు కాస్త దళసరిగా బంగారం పూత పూసి ఈ మోసానికి పాల్పడ్డాడు. లోపలంగా రాగితో నింపేశారు. ఆధునిక సాంకేతిక టెక్నాలజీతో బిస్కెట్లో ఎంత బంగారం ఉందో తెలుసుకునే అవకాశమున్నా బ్యాంకులు ఆ పని చేయకపోవడం వాటి పారదర్శకతపై అనుమానాలకు తావిస్తోంది. 

మానవజాతి చరిత్రలో ఇంత నకిలీ బంగారం బయటపడడం ఇదే తొలిసారి. స్కాం వల్ల చైనా కంపెనీలకు ఇతర దేశాల్లో ఇక్కట్లు ఎదురు కానున్నాయి. స్టాక్ ఎక్ఛేంజీల నుంచి వాటి పేర్లను తొలగించే అవకాశముంది. నకిలీ బంగారం కుంభకోణాలు మనదేశంలోనూ వెలుగు చూశాయి. బెంగళూరుకు చెందిన ఐఎంఏ గ్రూప్ అధిపతి మొహమ్మద్ మన్సూర్ ఖాన్‌ ఇంట్లో 5,880 నకిలీ బంగారం కడ్డీలు బయపడ్డాయి. వాటిని చూపించి అతడు ఇన్వెస్టర్లను మోసం చేశాడు.