ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న చైనాలో ఆరు దశాబ్దాల తర్వాత తొలిసారి జనాభా తగ్గింది. గతేడాది చివరి నాటికి దేశ జనాభా 141 కోట్ల 17 లక్షల 50 వేల మంది ఉన్నారని బీజింగ్ నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ మంగళవారం వెల్లడించింది. అంతకుముందు ఏడాది జననాలతో పోలిస్తే 8 లక్షల 50 వేల జనాభా తగ్గింది. 2022లో జననాల సంఖ్య 9.56 మిలియన్లు అయితే మరణాల సంఖ్య 10.41 మిలియన్లుగా ఉంది. అయితే కరోనా వల్లనే జననాల కంటే మరణాల సంఖ్య పెరిగిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతేడాది డిసెంబర్ 8, ఈ నెల 12వ తేదీ మధ్య 60 వేల మరణాలు కరోనా వల్ల సంభవించాయని అక్కడి ఆరోగ్యశాఖ అధికారులు చెప్తున్నారు. అధికారికంగా చెప్పకపోయినప్పటికీ ఆ దేశంలో కరోనా వల్ల లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది.
కాగా, 1960లో కరువు సందర్భంగా చివరిసారి చైనాలో జనాభా తగ్గుదల నమోదైంది. ఆ తర్వాత 1980లో ఒకేబిడ్డ విధానాన్ని కఠినంగా అమలు చేసి జనాభాను నియంత్రించింది. కానీ పనిచేసే వయసున్న పౌరుల సంఖ్య తగ్గుతుండడంతో 2021లో ముగ్గురు పిల్లలను కనేందుకు దంపతులకు అనుమతిచ్చారు. కానీ, అప్పటికే ఒక బిడ్డతో చిన్న కుటుంబాలకు అలవాటుపడిన చైనీస్ సమాజం.. ప్రభుత్వం అనుమతిచ్చినా పిల్లలను కనేందుకు ఆసక్తి కనబరచడం లేదని ఆస్ట్రేలియాలోని విక్టోరియా యూనివర్సిటీ పరిశోధకులు జియుజియాన్ పెంగ్ అభిప్రాయపడ్డారు.