ఒకపక్క భారత్‌తో నిత్యం ఘర్షణలు, మరోపక్క నేపాల్‌తో గొడవలు, ఇంకోపక్క అమెరికా, జపాన్, తైవాన్ నానా దేశాలతో వివాదాలతో కయ్యాలమారిగా మారిన చైనా మరింత దూకుడు ప్రదర్శిస్తోంది. యుద్ధానికి సర్వసన్నద్ధంగా ఉండాలని తన సైనికులను అప్రమత్తం చేసింది. ‘దేశంపట్ల సంపూర్ణ విశ్వాసంతో, చిత్తశుద్ధితో, పూర్తి సామర్థ్యంతో సిద్ధంగా ఉండాలి. మీ సర్వశక్తులను యుద్ధం కేంద్రీకరించింది.. నిత్యం అత్యంత అప్రమత్తంగా ఉండండి’ అని అధ్యక్షుడు జిన్ పింగ్ కోరారు. చావోజౌ నగరంలో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) మెరైన్ సైనికులను కలుసుకున్న ఆయన యుద్ధ సన్నాహాల గురించి మాట్లాడారు.
అయితే ఆయన వ్యాఖ్యలు భారత్‌ను ఉద్దేశించినవా, లేకపోతే అమెరికాను ఉద్దేశించి చేసినవా అన్నది తెలియడం లేదు. ఇటీవల అమెరికా నేవీ నౌక ఒకటి తైవాన్ జలసంధి మీదుగా వెళ్లడంపై చైనా అక్కసు వెళ్లగక్కుతోంది. తైవాన్ తమ అంతర్భాగమని, తమ సార్వభౌమతత్వానికి విఘాతం కలిగిస్తే సహించబోమని హెచ్చరిస్తోంది. అరుణాచల్, లద్దాఖ్లపై వివాదం ఇంకా పరిష్కారం కాలేదని, వాటిని భారత అంతర్భాగాలుగా గుర్తించబోమని ఇటీవల చైనా విదేశాంగ శాఖ చెప్పుకొచ్చింది. దీనికి తోడు తైవాన్ స్వయంపాలన డిమాండ్, అమెరికా జోక్యం తదితర పరిణామాల నేపథ్యంలో జిన్ పింగ్ యుద్ధ శంఖాన్ని పూరించారు.