తన పుట్టినిల్లయిన చైనాలో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజుకు వేల సంఖ్యలో ప్రజలకు సోకుతోంది. అంతకుముందు వైరస్ ని అరికట్టడానికి ప్రభుత్వం జీరో కోవిడ్ పాలసీని అమలు చేసినా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆంక్షలను సడలించింది. దీంతో కరోనాకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. రాబోయే మూడు నెలల్లో దేశ జనాభాలో 60 శాతం మందికి కరోనా సోకుతుందని నిపుణుల అంచనా. ఇది ప్రపంచ జనాభాలో 10 శాతం కావడం గమనార్హం. ఇప్పటికే కరోనా సోకిన వారు ఆసుపత్రుల్లో వైద్యం కోసం కిక్కిరిసి ఉండగా, శ్మశానవాటికల వద్ద నిత్యం వందల సంఖ్యలో శవాలు వస్తున్నాయని అంతర్జాతీయ పత్రికలు చెప్తున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం గత నాలుగు నెలల్లో కేవలం 2 మరణాలే సంభవించాయని చెప్తోంది. అటు వాస్తవ పరిస్థితి దీనికి విరుద్ధంగా ఉండడంతో చైనీయులు ఇంటి వైద్యం బాట పట్టారు. కరోనాకు సీ విటమిన్ విరుగుడు అని ప్రచారం జరగడంతో పెద్ద ఎత్తున కొనుగోలుకు ఎగబడ్డారు. ఆ దేశంలో అనియు కౌంటీ నుంచి నిమ్మకాయలు వస్తాయి. గిరాకీ పెరగడంతో అక్కడ నిమ్మకాయల ధరలు 20 నుంచి 30 శాతం వరకు పెరిగాయి. ముఖ్యంగా బీజింగ్, షాంఘై వంటి మహానగరాల్లో నిమ్మకాయలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. 130 ఎకరాల నిమ్మతోట ఉన్న రైతు మాట్లాడుతూ.. అంతకుముందు రోజుకు కేవలం 5 నుంచి 6 టన్నుల వరకు గిరాకీ ఉండేది. ఇప్పుడు 20 నుంచి 30 టన్నుల వరకు రోజువారీ డిమాండ్ చేరుకుంద’ని చెప్పారు. దీంతోపాటు రోగనిరోధక శక్తిని పెంచే నారింజ, పియర్స్, పీచ్ వంటి పండ్లకు డిమాండ్ పెరగడంతో ప్రజలు పండ్ల దుకాణాల వద్ద బారులు తీరారు. పండ్లతో పాటు మెడిసిన్స్ కి కూడా గిరాకీ పెరిగింది.