పనిచేసే చోట్ల యజమానులను మెప్పించడానికి ఉద్యోగులు ఎంతో కష్టపడుతూ ఉంటారు. కొందరు వారు చేసే పనిని శ్రద్దగా చేసి మెప్పు పొందుతారు. మరికొందరు యజమానుల వ్యక్తిగత పనులు చేస్తూ.. వారికి భజన చేస్తూ యజమానులతో శభాష్ అనిపించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే, చైనాకి చెందిన ఓ మహిళా ఉద్యోగి యజమాని మెప్పు కోసం టాయిలెట్ వాటర్ తాగింది. ఈ సంఘటన చైనాలోని షాంగ్‌డాంగ్ నగరంలో జరిగింది.
ఆ నగరంలోని ఓ ఫెర్టిలైజర్ కంపెనీలో ఓ మహిళ క్లీనర్‌గా పనిచేస్తున్నది. ఇటీవల ఆ కంపెనీ యజమాని ఆఫీస్‌ను పరిశీలించడానికి వచ్చాడు. అప్పుడు తన పనితీరును నిరూపించుకోడానికి టాయిలెట్లో నీటిని తాగింది. దీనిని చూసిన యజమాని, మిగతా సిబ్బంది తొలుత షాకయ్యారు. తరువాత పని పట్ల ఆమెకు ఉన్న అంకితభావాన్ని చూసి మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. ఆ నీటిని చూపిస్తే సరిపోయేది.. తాగాల్సిన అవసరం ఏముందని కొందరు కామెంట్లు పెడుతున్నారు.