మన పండగలను ఇంత కాలం సొమ్ము చేసుకున్న చైనాకు ఇకపై చిల్లిగవ్వా లేకుండా చుక్కలే కనిపించనున్నాయి. కెలికి కయ్యం పెట్టుకున్న చైనాతో భారత్ దోస్తీ కట్ చేసుకుంటున్న విషయం తెలిసిందే. దోస్తీ మాత్రమే కాకుండా చైనాతో భారత్‌కు ఉన్న అన్నీ ఆర్థిక సంబంధాలు తెగితెంపులు అవుతున్నాయి. ఈ క్రమంలో చైనాకు భారత్ నుంచి దసరా, దీపావళి సెగ తగిలింది. ఈ సమయంలో చైనా నుంచి వేల కోట్ల రూపాయల విలువైన వస్తు ఉత్పత్తులు ఇండియాకు దిగుమతి అయ్యేవి. ఎలక్ట్రానిక్ వస్తువులు, గృహోపకరణాలు, మొబైల్ ఫోన్లే కాకుండా పిల్లలు ఆడుకునే ఆటబొమ్మలు, ఆకర్షణీయమైన రంగులను వెదజల్లే బాణాసంచా… ఇలా సర్వం చైనా సప్లై చేసేది. వాటి మీద పండగల ఆఫర్లు అంటూ క్యాష్ చేసుకునేది. మన పండగలు, చైనాకు సంబరాలు అన్న తీరుగా తయారైంది వ్యవహారం. పండగ సీజన్లో భారత్‌లో రూ.70 వేల కోట్ల వ్యాపారం జరిగితే, అందులో రూ.40 వేల కోట్ల వ్యాపారం చైనా నుంచే జరుగుతోంది. ఇప్పుడు చైనాకు వెళ్లాల్సిన ఆర్డర్లు అన్నీ ఆగిపోయాయి. దీంతో చైనా చేతులు పిసుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది?
భారత్, చైనా సరిహద్దుల వద్ద, ముఖ్యంగా గాల్వాన్ లోయలో జరిగిన ఉద్రిక్త ఘటనల కారణంగా ఈ ఏడాది దీపావళి సీజన్లో చైనా వ్యాపారులకు పెద్ద దెబ్బ తగిలినట్టేనని సీఏఐటీ (కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆప్ ఇండియా ట్రేడర్స్) వెల్లడించింది. ఈ దెబ్బతో చైనాకు సుమారు రూ.40 వేల కోట్ల నష్టం వాటిల్లనుందని సీఏఐటీ జాతీయ అధ్యక్షుడు ఆర్సీ భాటియా తెలిపారు. చైనా వస్తువులపై ప్రజల్లో వ్యతిరేకత బాగా పెరిగిందనీ.. చైనా వస్తువులను కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తిని చూపడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ‘భారత్‌లో పండగ సీజన్ అమ్మకాల కోసం ప్రతి ఒక్కరూ తమ వద్ద ఉత్పత్తుల స్టాక్‌ను పెంచుకుంటున్నారు. ఈ సీజన్లో పూజ సామాన్లతో పాటు ఎలక్ట్రానిక్స్ ప్రొడక్టులతో పాటు కాస్మెటిక్స్, బాణసంచాలకు భారీ డిమాండ్ ఉండవచ్చు’ అని ఆయన అన్నారు. మరోపక్క ఈ సీజన్లో గత సంవత్సరంతో పోలిస్తే సుమారు 70 శాతం వరకు అధిక అమ్మకాలు సాగుతాయని ప్రముఖ మార్కెట్ రీసెర్చ్ సంస్థ సీర్ అంచనా వేసింది.
కాగా, కరోనా ఇంకా తగ్గకపోవడం, అన్‌లాక్ ప్రక్రియ కొనసాగుతూ ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో పండగ సీజన్ అమ్మకాలు సంతృప్తికరంగా ఉండకపోవచ్చనే అభిప్రాయం వెల్లడవుతోంది. అయితే ఉద్దీపన ప్యాకేజీలు అమలు అవుతుండటం, పలు రకాల ఉత్పత్తులపై ఆకర్షణీయమైన ఈఎంఐ ఆఫర్లను కంపెనీలు ప్రకటిస్తుండటంతో కొంత మేరకు వ్యాపారం సజావుగా సాగవచ్చని కూడా తెలుస్తోంది.