35 కోట్లమంది భారతీయుల డేటా చైనా సర్వర్లలో! - MicTv.in - Telugu News
mictv telugu

35 కోట్లమంది భారతీయుల డేటా చైనా సర్వర్లలో!

August 14, 2020

Chinese loan app Moneed leaked over 350 mn India users data from server in China.

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 35 కోట్ల మంది భారతీయుల డేటా చైనా సర్వర్లలో నిక్షిప్తం అయివుందని సమాచారం. భారతీయుల డేటా అంతా చైనాకు చెందిన మైక్రో లెండింగ్ యాప్ మొనీడ్ (Moneed)లో ఉందని తెలుస్తోంది. కావాలనే ఆ డేటాను చైనా సర్వర్లలో ఉంచారా, లేకపోతే డేటాను లీక్ చేశారా అన్నది తెలియాల్సి ఉంది. సెక్యూరిటీ రీసెర్చర్ అనురాగ్ సేన్ ముందుగా ఈ విషయాన్ని పసిగట్టి సదరు కంపెనీకి మెయిల్ ద్వారా తెలియజేశారు. మొదట్లో సదరు కంపెనీ స్పందించలేదు. అయితే తర్వాత సమస్యను పరిష్కరించామని వెల్లడించింది. తమ యాప్‌ను వాడుతున్న యూజర్ల డేటా భద్రంగా ఉందని, అది లీక్ కాలేదని మొనీడ్ ప్రతినిధి ఒకరు తెలిపారు. అత్యంత శక్తివంతమైన ఫైర్‌వాల్‌, సెక్యూరిటీలను ఏర్పాటు చేశామని అన్నారు. 

మొనీడ్‌లోని భారతీయుల డేటా చైనా సర్వర్లలో లేదని.. ముంబై సర్వర్‌లో ఉందని చెప్పారు. అయినా ఆ యాప్‌ను వాడే యూజర్లకు చెందిన డేటా చైనా సర్వర్లలో ఇప్పటికీ ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. యాప్‌లోని యూజర్లకు చెందిన పేర్లు, ఫోన్ నంబర్లు, ఇతర వివరాలతో కూడిన డేటా చైనా సర్వర్‌లలో ఉందని వారు అంటున్నారు. ఆ యాప్‌కు యూజర్ల ఫోన్లకు చెందిన వైఫై నెట్‌వర్క్‌లు, ఫోన్ స్టోరేజీలను యాక్సెస్ చేసే పర్మిషన్ ఉందని అన్నారు. దీని సహయంతో హ్యాకర్లు ఫోన్ వైబ్రేషన్‌ను కంట్రోల్ చేయవచ్చని, ఫోన్ నెట్‌వర్క్‌ను పూర్తి స్థాయిలో యాక్సెస్ చేయవచ్చని స్పష్టంచేస్తున్నారు. ఫోన్ స్టోరేజ్‌లో ఉండే కాంటాక్ట్‌లను యాక్సెస్ చేసి వాటిని మోడిఫై చేయవచ్చని, కంటెంట్‌ను చదవచ్చని  కూడా తేలింది. కాగా, మొనీడ్‌తో పాటు ప్లే స్టోర్‌లో ఉన్న మరో యాప్ మోమో కూడా ఆ యాప్ మాదిరిగానే యూజర్ల డేటాను తస్కరించి చైనా సర్వర్లలో నిక్షిప్తం చేస్తుందని తెలుస్తోంది.