కుక్కలకు పోలీసుల పేర్లు పెట్టాడని అరెస్ట్ - MicTv.in - Telugu News
mictv telugu

కుక్కలకు పోలీసుల పేర్లు పెట్టాడని అరెస్ట్

May 15, 2019

మనకు బాగా కోపం తెప్పించే వాళ్లలో ఎవరు ముందుంటారు? మన శత్రువులే కదా. అయితే మనం, వాళ్లు, వీళ్లు అనే తేడా లేకుండా పోలీసులు చాలామందికి శత్రువులుగా మారుతుంటారు. పోలీసుల్లో కొందరు చేసే అతి వల్ల మొత్తం పోలీసుల వ్యవస్థకు చెడ్డపేరు వస్తోంది. పోలీసులు అంటే ఏమాత్రం పడని ఓ వ్యక్తి తన కుక్కలకు వాళ్ల పేర్లు పెట్టాడు. మన దేశంలో అయితే అదేమంత పెద్ద నేరం కాదు. చాలామంది తమ శునకాలకు రాజకీయ నాయకుల పేర్లు పెట్టుకుని మురిసిపోతుంటారు. కానీ చైనాలో అది కుదరదు.

కుక్కలకు పోలీసుల, అధికారుల పేర్లు పెట్టినందుకు చైనాలో ఒకాయన కటకటాల పాలయ్యాడు. అన్హుయి రాష్ట్రానికి చెందిన యింగ్జౌ అనే 31 ఏళ్ల వ్యక్తికి కుక్కల పెంపకం ఉంది. ఒక కుక్కపిల్లకు చెంగువాన్ అని, మరో దానికి జీగువాన్ అని పేరు పెట్టాడు. చెంగువాన్ అంటే నగరపాలక అధికారి అని, జీగువాన్ అంటే ట్రాఫిక్ పోలీసు అని అర్థమట. పేర్లు పెట్టి ఊరుకుంటే సరిపోయేది. కానీ సదరు అధికారులను తిడుతూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టేశాడు. కుక్కలను తిడుతున్న సాకుతో వాళ్లను ఏకేశాడు. ‘వీడి పేరు చెంగువాన్.. తింటాడు, తొంగుంటాడు. వీణ్ని 428 డాలర్లకు అమ్మిపారేస్తాను’ అని ప్రచారం చేశాడు.

ఈ సంగతి చుట్టుపక్కల వారికి తెలిసింది. ఎవరో పోలీసులకు విషయం చేరవేశారు. గౌరవనీయ పదవుల్లో ఉన్న అధికారుల పేర్లను ‘నీచమైన’ కుక్కలకు పెడతావా అంటూ పోలీసులు వచ్చేసి యింగ్జౌను అరెస్ట్ చేశారు. అతనికి కోర్టు పది రోజలు రిమాండ్ విధించింది. చెంగువాన్, జీగువాన్‌లు మన దేశంలోని పోలీసుల మాదిరి తరచూ ప్రజలను వేధిస్తున్నందుకు ప్రతీకారంగా కుక్కలకు సరదా కోసం వాళ్ల పేర్లు పెట్టానని, అది నేరమనr తనకు తెలియదని మొత్తుకుంటున్నాడు..