Chinese man stuck in hydrogen balloon for 2 days
mictv telugu

హైడ్రోజన్ బెలూన్ తాడు తెగి రెండ్రోజులు గాల్లో చక్కర్లు కొట్టిన రైతు

September 9, 2022

హైడ్రెజన్ బెలూన్ సాయంతో చెట్టు కాయలు కోస్తున్న రైతు హఠాత్తుగా తాడు తెగిపోవడంతో బెలూన్‌తో పాటు గాల్లోకి ఎగిరిపోయాడు. అలా రెండ్రోజులు గాల్లోనే ఉండి 320 కిలోమీటర్లు ప్రయాణించి రష్యా సరిహద్దులో ల్యాండ్ అయ్యాడు. చైనాలో జరిగిన ఈ వింత సంఘటన గురించి అక్కడి మీడియా ప్రకారం వివరాలిలా ఉన్నాయి. ఈశాన్య చైనాలోని హిలాంగ్ షియాంగ్ ప్రావిన్సులో పైన్ కాయలు ఎక్కువగా కాస్తాయి. దీనినే గతంలో మంచూరియా అని పిలిచేవారు. ఈ చెట్లు ఎత్తుగా ఉంటాయి కాబట్టి రైతులు కాయలు కోయడానికి హైడ్రోజన్‌తో నిండిన బెలూన్ల సాయం తీసుకుంటారు. ఈ క్రమంలో ఇద్దరు రైతులు అలా వెళ్లగా అకస్మాత్తుగా తాడు తెగిపోయింది. అప్రమత్తమైన ఓ రైతు కిందకు దూకేయగా, హు అనే రైతు మాత్రం అందులోనే చిక్కుకుపోయాడు. ఇలా రెండ్రోజులు గాల్లోనే ఉండి 320 కిలోమీటర్ల దూరం ప్రయాణించాడు. చివరికి కిందకు దూకేసిన రైతు ఇచ్చిన సమాచారంతో స్పందించిన అధికారులు గాలింపు చర్యలు చేపట్టి రష్యా సరిహద్దులో ఉన్నట్టు గుర్తించారు. సెల్‌ఫోన్ ద్వారా హుని కాంటాక్ట్ చేసి ఎలా దిగాలో సూచనలిచ్చారు. బెలూన్‌లోని గాలిని కొంచెం కొంచెం తీయమని చెప్పగా, అతను అలాగే చేయడంతో ఎట్టకేలకు మళ్లీ భూమ్మీదకు చేరాడు. రెండ్రోజులు గాల్లో ఉండడంతో వెన్నునొప్పి మినహా ఇతర అనారోగ్య సమస్యలు ఏమీ లేవని అధికారులు వెల్లడించారు. హు ప్రస్తుతం ఆస్పత్రిలో కోటుకుంటున్నాడని తెలిపారు.